Telangana social issues: అన్నెం పున్నెం ఎరుగని పసిబిడ్డ అంగట్లో సరుకైంది. ముక్కుపచ్చలారని పసిగుడ్డుకు తల్లిదండ్రులు వెల కట్టి అమ్మేశారు. దీంతో తమ చెల్లెలిని అమ్మొద్దంటూ ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను వేడుకున్న తీరు..స్థానికుల హృదయాలు తల్లడిల్లేలా చేసింది. ఆ పిల్లల రోదన చూసి చూపరుల కళ్లు చెమ్మగిల్లాయి.
కన్నీళ్లు పెట్టించే కథనం: తల్లిదండ్రులు తమ పది రోజుల పసిబిడ్డను అమ్మేసిన హృదయ విదారక ఘటన నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ చెల్లెలిని అమ్మొద్దంటూ ఇద్దరు చిన్నారులు అమ్మానాన్నలను వేడుకున్న తీరు.. స్థానికుల హృదయాలు తల్లడిల్లేలా చేసింది. పేదరికం, ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలు ఉండటం వంటి కారణాలతో ఆ దంపతులు రూ. 3 లక్షలకు శిశువును విక్రయించారు. తిరుమలగిరి (సాగర్) మండలం ఎల్లాపురం తండాకు చెందిన కొర్ర బాబు, పార్వతి అనే గిరిజన దంపతులు ఏడేళ్ల కిందట నల్గొండ పట్టణానికి వలస వచ్చారు. వారికి 2006లో బాబు పుట్టి కొద్ది రోజులకే చనిపోయాడు. అనంతరం ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. 10 రోజుల కిందట 4వ కాన్పులో మరో ఆడపిల్ల పుట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో.. పేదరికం వల్ల మరో ఆడపిల్లను సాదలేక దళారుల ద్వారా ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వారికి బిడ్డను విక్రయించారు. ఈ అమ్మకం ద్వారా రూ. 3 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read:https://teluguprabha.net/crime-news/married-woman-suicide-in-jagtial-district/
అమ్మా.. చెల్లెను అమ్మొద్దే: పెద్దవూర మండలం ఊరబావి తండాకు సమీపంలో పొట్టిచెలమ వద్ద చిన్నారిని కొనుగోలుదారులకు అప్పగించారు. తమ బిడ్డను అమ్మేస్తున్న సమయంలో కొర్ర బాబు, పార్వతి దంపతుల ఇద్దరు పెద్ద బిడ్డలు “అమ్మా.. చెల్లెను అమ్మొద్దే..” అంటూ ఏడుస్తూ ప్రాధేయపడుతున్న వీడియోలు బయటకు రావడం ఈ ఘటన తీవ్రతను తెలియజేసింది. సోమవారం ఈ శిశు విక్రయం విషయం వెలుగులోకి వచ్చింది. పది రోజుల పాప కనిపించడం లేదంటూ కొర్ర బాబు అన్న సురేశ్ ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటపడింది.
కేసు నమోదు: శిశు విక్రయం ఘటనకు సంబంధించి నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐసీడీఎస్ సూపర్ వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు.. శిశువును అమ్మిన తండ్రితో పాటు కొనుగోలుదారులు, మధ్యవర్తులపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని అన్నారు. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.


