Laknapur reservoir tourism : నిన్నటి నీటికుంట.. నేటి పర్యాటక పంట! ఒకప్పుడు కేవలం చుట్టుపక్కల పొలాల దాహార్తిని తీర్చేందుకే పరిమితమైన ఓ జలాశయం, ఇప్పుడు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి సమీపంలో, పచ్చని పైర్ల నడుమ దాగి ఉన్న లఖ్నాపూర్ రిజర్వాయర్ ఇప్పుడు సరికొత్త హంగులతో సందర్శకులకు స్వాగతం పలుకుతోంది.
తెలంగాణలోని ఎన్నో ప్రకృతి అందాలు సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నాయన్న వాదనకు చెక్ పెడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని లఖ్నాపూర్ జలాశయాన్ని ఒక సుందరమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మినీ ట్యాంక్‌బండ్‌గా మారిన రిజర్వాయర్ :1967లో కేవలం రూ.47.56 లక్షల వ్యయంతో 2,647 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టు, ఇప్పుడు ఆధునిక హంగులను సంతరించుకుంటోంది.
మొదటి దశ అభివృద్ధి: రూ.6.81 కోట్ల అంచనా వ్యయంతో దీనిని మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ఆకర్షణీయమైన బోటింగ్ ప్లాట్‌ఫాం, బతుకమ్మ ఘాట్, వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేక ఘాట్‌లను నిర్మించడంతో ప్రాజెక్టు స్వరూపమే మారిపోయింది.
నడకదారి పునరుద్ధరణ: శిథిలావస్థకు చేరిన నడకదారిని నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.25 లక్షల వ్యయంతో పునర్నిర్మించారు. పట్టణానికి దగ్గరగా, చుట్టూ పచ్చని వ్యవసాయ క్షేత్రాల మధ్య ఉండటం సందర్శకులకు కనువిందు చేస్తోంది.
అలలపై ఆహ్లాదంగా.. బోటింగ్ ప్రారంభం : ప్రాంతవాసుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇటీవలే బోటింగ్ విహారాన్ని ప్రారంభించారు.
టికెట్ ధర, వివరాలు: పది మంది ఒకేసారి ప్రయాణించేందుకు వీలుగా 45 హార్స్‌పవర్ సామర్థ్యం గల బోట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కొక్కరికి టికెట్ ధరను రూ.100గా నిర్ణయించారు. కనీసం ఐదుగురు ప్రయాణికులు ఉంటే బోటు షికారుకు అనుమతిస్తారు. ఈ సౌకర్యం ప్రతిరోజూ మార్నింగ్ 9 గంటల నుంచి ఈవెనింగ్ 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
భవిష్యత్ ప్రణాళికలు.. మరిన్ని హంగులు : ఈ అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తాజాగా రూ.95 లక్షలను మంజూరు చేసింది. ఈ నిధులతో సందర్శకులకు మరిన్ని వసతులు కల్పించనున్నారు.
“లఖ్నాపూర్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నాం. బోటింగ్ ప్రారంభంతో స్థానికుల కలను సాకారం చేశాం. త్వరలోనే ప్రభుత్వం మంజూరు చేసిన రూ.95 లక్షలతో కాటేజీలు, ఉద్యానవనం, ఇతర సదుపాయాలు కల్పిస్తాం. పుట్టినరోజు వేడుకలు, ఇతర శుభకార్యాలు జరుపుకునేలా 30 సీట్ల సామర్థ్యం ఉన్న పెద్ద బోటును కూడా ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాం. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి” అని పరిగి ఎమ్మెల్యే డా.టి. రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

