ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల (లెజినోవా) ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందుగా తలనీలాలు సమర్పించి తన భక్తిని చాటారు. తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి విచారణ ఆఫీస్ విచారణ కార్యాలయానికి వెళ్లి, అక్కడే తలనీలాలు సమర్పించారు. అనంతరం భూవరాహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్న కొణిదెల నేడు తిరుమలలో బస చేసి.. సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొనబోతున్నారు. అనంతరం స్వామివారి దర్శనం తీసుకుని మొక్కులు చెల్లించనున్నారు.
ఇటీవల సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ స్వల్పంగా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే చికిత్స అనంతరం అతను పూర్తిగా కోలుకోవడంతో ఈ క్షేమతరుణాన్ని స్వామివారికి కృతజ్ఞతగా తీర్చుకోవాలనే ఉద్దేశంతో అన్నా ఈ పుణ్యయాత్రను చేపట్టారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమల వెళ్లారు. క్రైస్తవ మతానికి చెందిన ఆమె, హిందూ సంప్రదాయాల పట్ల గల గౌరవాన్ని ప్రతిబింబిస్తూ, టీటీడీ నిబంధనల మేరకు హిందూ ధర్మంపై తనకు నమ్మకం ఉందని.. డిక్లరేషన్ అందజేశారు.
హిందూ సాంప్రదాయంలో తల వెంట్రుకలను భగవంతుని సమర్పించడం అత్యంత పవిత్రమైన చర్యగా భావిస్తారు. అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుని వైపుగా పూర్తిగా లయమయ్యే సంకేతంగా భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఈ పద్ధతిలో భక్తులు మానసిక, శారీరక శుద్ధిని అనుభవిస్తారు. అన్నా కొణిదెల కూడా అదే తత్త్వంతో స్వామివారిని దర్శించుకోవడం విశేషం.