CM Revanth Reddy Residence: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పీడీఎస్‌యూ కార్యకర్తలు యత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. అలాగే విచ్చలవిడిగా డొనేషన్లు తీసుకుంటూ దోచుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని పోలీసు వ్యాన్‌లో ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీడీఎస్‌యూ కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో కాసేపు సీఎం నివాసం పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఇదిలా ఉంటే కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వినతిపత్రాలు సమర్పించనున్నారు. అలాగే మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అనుమతులు ఇవ్వాలని కోరనున్నారు. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టును నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయనునున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
అంతకుముందు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని బొటానికల్ గార్డెన్‌లో రుద్రాక్ష మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. మనం వనాన్ని కాపాడితే.. వనమే మనల్ని కాపాడుతుందని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
Also Read: వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
రాష్ట్రంలో ప్రతి తల్లి తమ ఇంట్లో రెండు మొక్కలను నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలను కోటేశ్వరులను చేయడమే తన ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఇందుకోసం వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్ విభజన ద్వారా అసెంబ్లీ సీట్లు 153కు పెరగబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ సీట్లలో మహిళా రిజర్వేషన్ 33 శాతం కింద మహిళలకు 51 సీట్లు దక్కుతాయన్నారు. అయితే కాంగ్రెస్ పార్ట తరపున మొత్తం 60 సీట్లు మహిళలకు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.