నర్సంపేటలోని మాదన్నపేట చెరువును మినీ ట్యాంక్ బండ్ గా చేసేటందుకు నేను నిధులు తీసుకువస్తే.. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న నాయకులు కాంట్రాక్టర్ల పేరుతో అభివృద్ధిని అడ్డుకున్నారని, వారికి మీరందరూ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని నర్సంపేట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన నాగుర్లపల్లి, మాదన్నపేట, బోజ్యా నాయక్ తండ, చంద్రయపల్లే గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలిచిన అయిదేళ్లలో చంద్రయ్య పల్లె గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసింది నేనేనని, గ్రామంలో సిసి రోడ్లు, నూతన గ్రామపంచాయతీ బిల్డింగు, మహిళా బిల్డింగు ఇచ్చింది కూడా నేనే అన్నారు. ఎన్నికలలో మళ్లీ మీరందరూ నన్ను గెలిపిస్తేనే ఆగిన పనులు సమృద్ధిగా జరుగుతాయని, వాళ్ళు వస్తే అటుకెక్కుతాయి అని అన్నారు.
మీ ప్రాంత బిడ్డను నేను మాత్రమేనని, ఈ ప్రాంత చెరువును గోదావరి జలాలతో నింపి చంద్రయ్యపల్లెను సస్యశ్యామలం చేసే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు. నన్ను జయించలేక 30 ఏళ్ల ప్రత్యర్ధులు వాళ్ల రాజకీయ రిటైర్మెంట్ టైంలో ఒకటైనారని, మాజీ ఎమ్మెల్యేలు వాళ్లు గెలిచిన తర్వాత ఊర్లల్లకు రారు, అసెంబ్లీకి పోరు, అభివృద్ధి గూర్చి మాట్లాడరు, అది వారి విధానం అని ఎద్దేవా చేశారు. కాలువలు తెల్వనోళ్లు, పంటలు తెల్వనోళ్లను పక్కన పెట్టండి. నీళ్లు తెచ్చే నాకు మద్దతు ఇవ్వండని మిమ్మల్ని కోరుతున్నాను అని అభ్యర్థించారు.