సమైక్య రాష్ట్రంలో వ్యవసాయానికి సక్రమంగా కరెంటు ఇవ్వాలని ఆందోళన చేస్తే అప్పటి ప్రభుత్వం కర్కశంగా రైతులను కాల్చి చంపిందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల కరెంటు కష్టాలకు పూర్తిగా పరిష్కారం చూపించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామాలకు సాగునీరు, విద్యుత్తు ఇచ్చినట్లయితే గ్రామాలు బతికిపోతాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం, భూత్పూర్ మండలంలోని వెల్కిచర్ల గ్రామంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన 33 /11 కెవి సబ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు.
విద్యుత్తు విజయోత్సవ సభలో మంత్రి మాట్లాడుతూ… గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పూర్తిగా వ్యవసాయంపైన ఆధారపడి ఉంటాయని, అందువల్ల రైతులకు నీళ్లు, విద్యుత్ ఇస్తే బ్రతికి పోతారని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులకు ఏ విధంగా మేలు చేయాలో ఆలోచించలేదని… చెక్ డ్యాములు, చెరువులు, కాలువలు ఎలా నింపాలో చర్యలు తీసుకోలేదన్నారు. బోర్లు పడక, నీళ్లు లేక విద్యుత్ లేక ఉన్న పొలాన్ని అమ్ముకొని రైతులు వలస వెళ్లి బీడు భూములు, అప్పులతో అల్లాడిపోయారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద కరివెన వంటి రిజర్వాయర్లను నిర్మించామన్నారు. 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు నీళ్లు, విద్యుత్ ఇచ్చి ఉంటే రైతులు వలస వెళ్లేవారు కాదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు గొప్పగా ఉన్నాయని, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతోపాటు, విద్యుత్ తలసరి వినియోగం రాష్ట్రంలో బాగా పెరిగిందని తెలిపారు.
విద్యుత్తు, సాగునీటితో పరిశ్రమలు వస్తున్నాయని, ఇతర రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, తెలంగాణ బ్రతుకుతెరువు కల్పించిందని, అందరికీ అన్నం పెట్టిందని తెలిపారు. గతంలో విద్యుత్ ఉద్యోగులు గ్రామాలకు వెళ్లాలంటే భయపడేవారని, జీతాలు సైతం తక్కువగా ఉండేవని ఇప్పుడు వారికి అత్యంత అధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. భూత్పూర్ కు ప్రత్యేక ఫీడర్ ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఉచితంగా స్థలాన్ని ఇచ్చిన నారాయణ కుమారుడికి నెలాఖరులోగా ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.రవినాయక్, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజు గౌడ్, పిఎసిఎస్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, ఎంపీపీ శేఖర్ రెడ్డి, ఎస్ ఈ రామ్మూర్తి, డి.ఈ చంద్రమౌళి, సర్పంచ పద్మజ, డి ఆర్ డి ఓ యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, తహసిల్దార్ చెన్న కిష్టన్న, ఎంపీడీవో మున్నీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.