Petition in HC on New Liquor Policy: రాష్ట్రంలో నూతన మద్యం విధానంపై హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. మద్యం దుకాణాల టెండర్ దక్కించుకోని వారికి దరఖాస్తు ఫీజును తిరిగి ఇచ్చేలా అబ్కారీ శాఖను ఆదేశించాలని పిటిషన్ దాఖలైంది. టెండర్ కోసం చేసిన దరఖాస్తులకు చెల్లించిన మొత్తం అబ్కారీ శాఖకే చేరుతుందని.. టెండర్ పొందని వారికి ఆ డబ్బు తిరిగి వచ్చేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
తెలంగాణలో గతంలో మద్యం టెండర్ కోసం ఒక్కో దరఖాస్తుకు రుసుము రూ. 2 లక్షలుగా ఉండేది. అయితే ఈ సారి ఆ మొత్తాన్ని రూ. 3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. కాగా, దరఖాస్తు చేసిన వారు లాటరీలో మద్యం దుకాణం దక్కించుకోకపోతే ఆ మొత్తం ఎక్సైజ్ శాఖకే చెందుతుంది. ఈ మేరకు దీనిని సవాల్ చేస్తూ అనీల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.
మద్యం దుకాణాలు దక్కించుకోని వారు చెల్లించిన మొత్తాన్ని వారికే తిరిగి చెల్లించేలా ఎక్సైజ్ శాఖను ఆదేశించాలని పిటిషన్‌లో అనీల్ కుమార్ కోరారు. అంతేకాకుండా, మద్యం విధానంపై జారీ చేసిన జీఓను సైతం రద్దు చేయాలని హైకోర్టును విజ్ఞప్తి చేశారు. కాగా, ఉన్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను స్వీకరించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/mahabubnagar-govt-schools-astronomy-labs/
రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం దుకాణాల గడువు నవంబర్ 30 వరకు ఉంది. డిసెంబరు 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు చెల్లుబాటులో ఉండే లైసెన్సుల కోసం దరఖాస్తులకు టెండర్ల ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా ఈ నెల 18వ తేదీన ముగియనుంది.


