BC Reservations Petition Supreme Court: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రటించింది. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లను ఎత్తివేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపింది.
కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని సుప్రీంకోర్టులో వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్‌లో ప్రస్తావించారు. గతంలో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్ మించరాదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్‌ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణకు చేపట్టనుంది. జస్టిస్ విక్రమ్ నాథ్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.
కాగా రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించిన అనంతరం.. ఆ తర్వాత ఆ బిల్లు గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే ఈ బిల్లుపై గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తమ వద్దనే పెండింగ్‌లోనే ఉన్నాయని ఇటీవల రాజ్ భవన్ తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీ బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది.


