Saturday, November 15, 2025
HomeతెలంగాణPiracy : పైరసీ సినిమాతో పరేషాన్ - మీ డేటాకు సైబర్ గాలం!

Piracy : పైరసీ సినిమాతో పరేషాన్ – మీ డేటాకు సైబర్ గాలం!

Cybersecurity risks of piracy : కొత్త సినిమా థియేటర్‌లోకి వచ్చిందో లేదో, మన స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్షమైపోతుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బ్రహ్మాండమైన వినోదం అనుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఆ ఉచిత వినోదం వెనుక ఓ పెద్ద సైబర్ ఉచ్చు పొంచి ఉందని, మీ ఒక్క క్లిక్‌తో మీ వ్యక్తిగత సమాచారం మొత్తం నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసలు పైరసీ లింక్‌ల ద్వారా సైబర్ మాయగాళ్లు మనల్ని ఎలా మోసం చేస్తున్నారు? మన బ్యాంకు ఖాతాల వివరాలు వారికి ఎలా చేరుతున్నాయి? ఈ పైరసీ రాకెట్‌ను పోలీసులు ఎలా ఛేదించారు?

- Advertisement -

సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఉచితంగా అందిస్తున్నామంటూ వివిధ వెబ్​సైట్లు, సోషల్ మీడియా వేదికలపై లింకులతో నెటిజన్లను ఊరిస్తున్నారు. ఆశపడి ఆ లింక్‌పై క్లిక్ చేస్తే, మన స్మార్ట్‌ఫోన్ నియంత్రణ పాక్షికంగా వారి చేతుల్లోకి వెళ్లినట్లేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పైరసీ వెనుక వ్యవస్థీకృత ముఠాలు పనిచేస్తున్నాయని, హ్యాకర్లు, ఏజెంట్ల ద్వారా సినిమాలను దొంగిలించి ఆన్‌లైన్‌లో పెడుతున్నారని పోలీసులు వెల్లడించారు.

సరదా క్లిక్‌తో సర్వం దోపిడీ: ఒక పైరసీ సినిమా లింక్‌ను క్లిక్ చేసినప్పుడు, వినియోగదారుడికి తెలియకుండానే వారి ఫోన్‌లో మాల్‌వేర్ లేదా స్పైవేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. “పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సరదాగా క్లిక్ చేస్తే, ఉచిత ఆన్‌లైన్ గేమింగ్ అంటూ మరో లింక్ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేయగానే వినియోగదారుడి వ్యక్తిగత సమాచారం, ఫోన్‌లోని యాప్‌ల చిట్టా, చివరకు బ్యాంకు ఖాతా వివరాలు కూడా సైబర్ నేరగాళ్లకు చేరిపోతున్నాయి,” అని సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఈ సమాచారంతో వారు మన ఖాతాలను ఖాళీ చేయడం లేదా మన వ్యక్తిగత డేటాను ఇతర నేరగాళ్లకు అమ్ముకోవడం వంటివి చేస్తారని తెలిపారు. అందుకే తెలియని లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

లోపభూయిష్ట సర్వర్లే వరం: సినిమా పరిశ్రమకు కొరకరాని కొయ్యగా మారిన ఈ పైరసీ రాకెట్‌ను ఛేదించేందుకు పోలీసులు నాలుగు నెలల పాటు తీవ్రంగా శ్రమించారు. ఈ దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. “కొత్త సినిమాలను భద్రపరిచే పలు మీడియా కంపెనీల ప్రధాన సర్వర్లలో భద్రతా లోపాలను గుర్తించాం. వారు ఇప్పటికీ పాతకాలపు సాఫ్ట్‌వేర్‌లను వాడుతుండటంతో, హ్యాకర్లు చాలా సులభంగా సర్వర్లలోకి చొరబడి డేటాను తస్కరిస్తున్నారు,” అని సైబర్‌ క్రైమ్ కానిస్టేబుళ్లు ప్రశాంత్, రుక్మిణి వెల్లడించారు. రూ.2 కోట్ల విలువైన సరికొత్త సాఫ్ట్‌వేర్‌లను సైబర్‌ల్యాబ్‌లో అమర్చడం ద్వారా ఇలాంటి కేసుల దర్యాప్తును వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు: ఈ పైరసీ ముఠా సభ్యులను పట్టుకోవడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది. తమిళనాడుకు చెందిన ప్రధాన నిందితుడు సుధాకరన్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు, సత్యమంగళం అటవీ ప్రాంతంలో పోలీసుల కారుపై ఓ ఏనుగు దాడి చేసిందని, ఈ ఘటనలో తృటిలో ప్రాణాలతో బయటపడ్డామని ఎస్సై మన్మోహన్ గౌడ్ ఆనాటి భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

మేల్కొన్న చిత్రసీమ: ఈ అరెస్టుల నేపథ్యంలో చిత్ర పరిశ్రమ కూడా అప్రమత్తమైంది. “పైరసీని అరికట్టేందుకు మేము ఇంకా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఘటన మాకు తెలియజెప్పింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మేం ఎంత అప్రమత్తంగా ఉండాలో అర్థమైంది. మా యాంటీ-పైరసీ సెల్ ద్వారా ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం,” అని సినీ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad