PM Modi condolences: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనలో కార్మికులు మృతి చెందడంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మృతుల బంధువులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తామన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
పాశమైలారంలోని సిగాచి కెమిల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి షెడ్డు కూలిపోవడంతో శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ పేలుడు ఘటనలో సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ గోవన్ కూడా దుర్మరణం పాలయ్యారు. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన సమయంలోనే పేలుడు సంభవించడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కాగా పరిశ్రమల భద్రతపై త్వరలోనే ఓ కమిటీ వేస్తామని మంత్రి గడ్డం వివేక్ తెలిపారు.
కాగా ఈ ఘటన దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ప్రముఖ నేతలు తమ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.