తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy)పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు. తనను కించపరుస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని.. ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని నటి మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అమె ఫిర్యాదు మేరకు ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తాడిపత్రి మహిళలకు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌పై మాధవీలత స్పందిస్తూ… జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లవద్దని సూచించారు. అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై జేసీ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. మాధవీలతపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పారు. మాట్లాడాల్సిన మాటలు మాట్లాడి క్షమాపణ చెబితే సరిపోతుందా అంటూ మాధవీలత ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయనపై మా అసోసియేషన్‌తో పాటు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.