కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో రసాభాస నేపథ్యంలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై మూడు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై దురుసుగా ప్రవర్తించారంటూ కౌశిక్ రెడ్డిపై సంజయ్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇక కలెక్టరేట్ లో బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించారంటూ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో గందరగోళం సృష్టించి, సమావేశాన్ని పక్కదారి పట్టించారంటూ కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో కేసు నమోదైంది.
కాగా కరీంనగర్ కలెక్టరేట్‌లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. సంజయ్‌ను ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం ముదిరి ఇద్దరూ పరస్పరం తోసుకున్నారు. దీంతో ఈ సమావేశంలో గందరగోళం నెలకొంది.