Police investigation methods : “సీసీ ఫుటేజీ లేదా? నిందితుడు సెల్‌ఫోన్ వాడలేదా? అయితే, ఆ కేసు దర్యాప్తు ముందుకు సాగడం కష్టమే.” ప్రస్తుతం పోలీస్ స్టేషన్లలో బాధితులకు పరోక్షంగా వినిపిస్తున్న సమాధానమిది. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం ఒక వరంలా మారినప్పటికీ, దానిపైనే పూర్తిగా ఆధారపడటం శాపంగా పరిణమిస్తోంది. క్షేత్రస్థాయి దర్యాప్తు, మానవ వనరుల నైపుణ్యాన్ని విస్మరించడం వల్ల ఎన్నో కీలకమైన కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్ జాబితాలో మగ్గిపోతున్నాయి.
దీనికి అంబర్‌పేట డీడీ కాలనీలో జరిగిన జంట హత్యల కేసే ప్రత్యక్ష సాక్ష్యం. గత ఏడాది అక్టోబరులో విశ్రాంత ఉద్యోగి లింగారెడ్డి (78), ఆయన భార్య ఊర్మిళాదేవి (72)లను దుండగులు దారుణంగా పొడిచి చంపారు. అయితే, వారి ఇంటి సమీపంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, ఎలాంటి అనుమానాస్పద ఫోన్ కాల్స్ ఆనవాళ్లు లభించకపోవడంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
అప్పట్లో అలా.. నేరస్థుడి గుండెల్లో రైళ్లు : సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో పోలీసుల దర్యాప్తు తీరే వేరుగా ఉండేది.
ఇన్ఫార్మర్ల వ్యవస్థ: ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు నమ్మకమైన సమాచారకులు (ఇన్ఫార్మర్లు) ఉండేవారు. చిన్న అనుమానం వచ్చినా, కొత్త వ్యక్తి తచ్చాడినా వెంటనే పోలీసులకు ఉప్పందించేవారు.
క్షేత్రస్థాయి విచారణ: సంఘటనా స్థలంలో లభించిన చిన్న ఆధారాన్ని పట్టుకుని, స్థానికులను విచారించి, పాత నేరస్థుల రికార్డులను జల్లెడ పట్టి నేరస్థుడిని గుర్తించేవారు.
సాక్షుల వాంగ్మూలాలు: ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుల స్కెచ్‌లు గీయించి, వాటి ద్వారా నేరస్థులను పట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. వేలిముద్రలు, కాళ్ల గుర్తులు వంటి భౌతిక ఆధారాలే దర్యాప్తులో కీలకంగా వ్యవహరించేవి.
ఇప్పుడిలా.. టెక్నాలజీనే తారకమంత్రం : టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దర్యాప్తు స్వరూపమే మారిపోయింది.
నిఘా నేత్రాలు: నగరాల్లోని సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ఫుటేజీల ద్వారా నిందితులు ఏ మార్గంలో వచ్చారు, ఎటు వెళ్లారనేది సులభంగా గుర్తిస్తున్నారు.
సెల్‌ఫోన్ డేటా: మొబైల్ టవర్ సిగ్నల్స్, కాల్ డేటా రికార్డులు (సీడీఆర్), జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా నిందితుడు ఎక్కడున్నాడో క్షణాల్లో పసిగట్టగలుగుతున్నారు.
ఫోరెన్సిక్ ఆధారాలు: డీఎన్‌ఏ, వేలిముద్రల విశ్లేషణ, ఫేస్ రికగ్నిషన్ వంటి ఆధునిక పద్ధతులతో నిందితులను కచ్చితంగా నిర్ధారిస్తున్నారు.
సాంకేతికత సాక్ష్యం లేకుంటే.. చేతులెత్తేయడమేనా : టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతున్నప్పటికీ, నిందితులు తెలివిగా వ్యవహరిస్తే పోలీసులు చేష్టలుడిగిపోతున్నారు.
ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన మహిళ హత్య కేసు ఇందుకు నిదర్శనం. ఈ కేసులో నిందితులిద్దరూ సెల్‌ఫోన్లు ఉపయోగించలేదు. వారిని రాంచీకి తీసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్ స్వయంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే ఆచూకీ లభించింది. ఒకవేళ ఆ డ్రైవర్ ముందుకు రాకపోయి ఉంటే, ఈ కేసు కూడా పెండింగ్ జాబితాలో చేరిపోయేదని ఓ అధికారి వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. అదేవిధంగా, 12 ఏళ్ల బాలిక కేసులోనూ సీసీ కెమెరా ఫుటేజీ లభించకపోవడంతో దర్యాప్తు ఆలస్యమైంది.
నేర పరిశోధనలో సాంకేతికతను వినియోగించుకోవడం అవసరమే అయినా, దానికే పరిమితం కాకుండా, పాత పద్ధతులకు పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్షేత్రస్థాయి దర్యాప్తు, ఇన్ఫార్మర్ వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే ఎలాంటి కేసైనా ఛేదించి, బాధితులకు సత్వర న్యాయం అందించడం సాధ్యమవుతుంది.


