కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పర్యావరణం, జంతువుల ప్రాణాలు కాపాడాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వేలాది మంది పోలీసులు యూనివర్సిటీ చుట్టూ మోహరించారు. బారికేడ్లు ఏర్పాటుచేసి బయటి వ్యక్తులను లోపలికి రానీయకుండా అడ్డుకుంటున్నారు. దీంతో క్యాంపస్ లోపల విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీస్ జులుం నశించాలని నినాదాలు చేశారు. దీంతో హెచ్‌సీయూ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్రంగా ఖండించారు.ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీ తలపిస్తున్న రేవంత్ రెడ్డి సోకాల్డ్ ప్రజాపాలన. విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్లపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం” అని పేర్కొన్నారు.