Bigg Boss-8 Final: నేడు బిగ్ బాస్-8 గ్రాండ్ ఫినాలే(Bigg Boss-8 Final) నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు రావొద్దని సూచనలు చేశారు. ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇందిరానగర్, కృష్ణానగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియోకు వాహన రాకపోకలపై నిషేదం విధించారు. ఈమేరకు బందోబస్తు ఏర్పాట్లను వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా బిగ్‌బాస్ నిర్వహకులదే బాధ్యత అని హెచ్చరించారు.
కాగా గత సీజన్‌లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 17న ముగిసిన బిగ్‌బాస్-7లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బస్సులు, కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇందులో ఐదుగురు ఫైనల్‌కు చేరుకున్నారు. నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్, అవినాష్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. అయితే టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్ ఉన్నట్లు సమాచారం. మరి విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.