కేటీఆర్ ఢిల్లీ టూర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో కేంద్రం పెద్దలను ఒప్పించి తన చెల్లి బెయిల్ పొందినట్లుగానే.. తనను తాను కాపాడుకునేందుకు మళ్లీ ఢిల్లీ వెళ్లారా అంటూ కేటీఆర్ పై సెటైర్లు వేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కేటీఆర్‌కు ఏం పని? అని పొంగులేటి ప్రశ్నించారు.
ఫార్ములా ఈ రేసింగ్‌లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం గుర్తించిందని పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas) వెల్లడించారు. ఫార్ములా – ఈరేసింగ్ నిర్వహణకు విదేశాల్లోని సంస్థలకు 55కోట్లను ఏవిధంగా మళ్లించారు? విదేశాలకు ఏ చట్టం ప్రకారం రూ.55 కోట్లు పంపారు? అని కేటీఆర్ ని ఆయన నిలదీశారు. కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు గవర్నర్‌కు ఏసీబీ విజ్ఞప్తి చేసింది. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నిస్తుంది. కేసుల మాఫీ కోసమే కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్టు మా వద్ద ఆధారాలు ఉన్నాయి. నేను పేల్చబోయే బాంబేంటో కేటీఆర్ కు తెలుసు. అంబానీ, అదానీ, ఆర్ఎస్స్ఎస్, బీజేపీ పెద్దలను కలిసి తనను ఫార్ములా -ఈరేసింగ్ కేసు నుంచి తప్పించాలని ప్రాధేయపపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి పొంగులేటి ఆరోపించారు.
కాగా, సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. అమృత్ పథకం టెండర్లలో స్కామ్ జరిగిందని కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకే ఢిల్లీ వెళుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఇటీవల అమృత్ టెండర్లలో అవకతవకలు జరిగాయని కేటీఆర్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.