గత పదేళ్ల పాలనలో బీసీల గురించి మాట్లాడని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీసీ ఎజెండా ఎత్తుకోవడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ మహాసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha)చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో బీసీలకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ముఖ్య రాజకీయ పదవుల్లో ఏదో ఒక పదవిని బీసీలకు ఇచ్చే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కులానికి చెందిన వ్యక్తి సీఎం అయితే… మరో కులానికి చెందిన వ్యక్తి పీసీసీ చీఫ్ అయ్యారని తెలిపారు. అది కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ అని తెలిపారు. పార్టీలో తనకు హక్కు ఉందని అన్నందుకే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బలవంతంగా పార్టీ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. బీసీల గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ తొలుత సంస్థాగత పదవువుల్లో బీసీలను అవకాశం ఇచ్చిన తర్వాతే మాట్లాడాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించిందే బీఆర్ఎస్ అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతామని పొన్నం స్పష్టంచేశారు.