పొన్నం ప్రభాకర్… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఈ పేరు తెలియని వారు ఉండరనేది అక్షర సత్యం. మాజీ ఎంపీగా, తెలంగాణ ఉద్యమ కాలంలో అధికార పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ వాణిని పార్లమెంట్ సాక్షిగా బలంగా వినిపించిన గొప్ప నాయకుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారుడు. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి, తెలంగాణ ప్రజల సమస్యలు, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల కష్టాలపై, ప్రభుత్వ వైఫల్యాలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. ఇలా వేదిక ఏదైనా తనదైన శైలిలో గాంభీర్యం, ప్రేమానురాగాలను ఏకకాలంలో పంచుతూ హోదాను సైతం పక్కన పెట్టి అందరితో కలివిడిగా ఉంటూ, ఆప్యాయతను పంచుతూ అందరిలో ఒకడిగా ఉండే అందరి వాడు, గొప్ప ప్రజా నాయకుడు. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ, పొన్నం ఎక్కడుంటే సందడి అక్కడుంటుంది అన్నట్టు మెలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్నబోయిన స్వరంతో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదే సమయంలో ఆవేదన అంచుల్లోకి తీసుకువెళ్లింది.
సన్నిహితుల మధ్య..
వివరాల్లోకి వెళ్తే బుధవారం వేములవాడ పర్యటనకు వచ్చిన మంత్రి పొన్నం ముందుగా వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ అలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాడు. అదే సమయంలో పొన్నం తల్లిని ఉద్దేశిస్తూ ఎంపీ బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పొన్నం పక్కన ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులూ పొన్నం ఆవేదనను చూసి తట్టుకోలేక వారు సైతం తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. దీంతోపాటు రాజన్న ఆలయంలో జరిగిన మహా శివరాత్రి జాతర రివ్యూ మీటింగ్ అనంతరం పొన్నం తన సన్నిహిత మీడియా మిత్రులతో మళ్ళీ ఒకసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఓదార్చిన మీడియా ప్రతినిధులు..
పొన్నం మాటలతో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు సైతం ఆవేదనకు గురయ్యారు. అనంతరం స్పందించిన మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడుతూ.. “గత 30 ఏండ్లుగా మిమ్మల్ని చూస్తున్నాం, మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో మాకు బాగా తెలుసం”టూ మంత్రికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఎటువంటి భేషజాలు చూపక, ఇమేజ్, ఈగోలను ఏమాత్రం పొడసూపక ప్రవర్తించే పొన్నం ఆవేదన ఈ చిట్ చాట్ లో పాల్గొన్న వారందరికీ బాధను కలిగించింది.