Ponnam Prabhakar Speaks on Urea Shortage: తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రెవెన్యూ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారం గాంధీ భవన్‌లో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్‌రెడ్డి రామ్‌రెడ్డి, మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, కత్తి వెంకట్ స్వామి, కైలాష్ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనే దురుద్ధేశంతో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కై ఈ రకమైన కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనే మాట వాస్తవమేనని, అయితే ఎరువుల కొరతకు బాధ్యత వహించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఒక రైతు బిడ్డగా మాజీ మార్క్ ఫేడ్ చైర్మన్ గా రైతుల ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో గమనిస్తున్నానని, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. ఎరువుల కొరతపై సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత మంత్రులకు లేఖలు రాసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రైతుల ఇబ్బందులు మీకు పట్టవా అంటూ బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
యూరియా సరఫరా బాధ్యత కేంద్రానిదే..
రైతులకు యూరియా సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదన్నారు. రాష్ట్రాలకు యూరియా సరఫరా చేసే బాధ్యత నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు గానూ రామగుండం ఎరువుల కర్మాగారంలో 4 నెలలుగా ఉత్పత్తి జరగట్లేదని ఆరోపించారు. రామగుండంలో ఎరువులు ఉత్పత్తి ప్రారంభించి వెంటనే రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి 11 లక్షల టన్నులకు గాను 5.2 లక్షల టన్నుల ఎరువులే కేంద్రం నుంచి వచ్చాయని ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. రాజకీయ కక్ష ఉంటే తమపై తీర్చుకోవాలి కానీ రైతులపై కాదన్నారు.
కేంద్రానికి వ్యతిరేకంగా రైతులతో ఆందోళనలు..
రైతుల సహకారంతో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామన్నారు. బీజేపీ కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నప్పటికీ తెలంగాణ రైతాంగాన్ని నిరక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు రైతు సమస్యల లపట్ల కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు. యూరియా కొరత విషయంలో ఇటు బీఆర్‌ఎస్, అటు బీజేపీ నాటకాలాడుతున్నాయని వాస్తవాలను కప్పిపుచ్చి తెలంగాణ రైతాంగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. యూరియా ఎవరిస్తే వాళ్లకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్ధతిస్తామని కేటీఆర్ చెప్పడాన్ని ఆయన ప్రస్తావించారు. కేంద్రం యూరియా ఇవ్వడం లేదు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు కాకుండా తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ సభ్యులు ఓటు వేయాలని కోరారు.


