Deen Dayal Sparsh Yojana scholarship program : డిజిటల్ యుగంలో ఉత్తరాలకు, స్టాంపులకు విలువుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమిస్తూ, చిన్నారుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించేందుకు భారత తపాలా శాఖ నడుం బిగించింది. కేవలం ఉత్తరాల బట్వాడాకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో జ్ఞానాన్ని, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో ‘దీన్ దయాళ్ స్పర్శ్ యోజన’కు శ్రీకారం చుట్టింది. తపాలా బిళ్లల సేకరణ (ఫిలాటెలీ) అనే అద్భుతమైన హాబీని ప్రోత్సహిస్తూ, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏకంగా ఉపకార వేతనం అందించేందుకు సిద్ధమైంది. అసలేంటి ఈ పథకం..? ఎవరు అర్హులు..? ఈ ఉపకార వేతనం ఎలా పొందాలి..?
ఏమిటీ ‘దీన్ దయాళ్ స్పర్శ్ యోజన’ : చిన్నారుల్లో స్టాంపుల సేకరణపై అభిరుచిని పెంచడం, దాని ద్వారా వారిలో జనరల్ నాలెడ్జ్, చారిత్రక పరిజ్ఞానాన్ని పెంపొందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. SPARSH అంటే ‘స్కాలర్‌షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీ’. ఇందులో భాగంగా 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తపాలా శాఖ ఒక రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఏడాదికి రూ.6,000 చొప్పున ఉపకార వేతనం అందిస్తుంది.
పరీక్ష విధానం.. ఎంపిక ప్రక్రియ : ఈ స్కాలర్‌షిప్ పొందాలనుకునే విద్యార్థులు రెండు దశల ఎంపిక ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.
అర్హత, దరఖాస్తు: 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. దరఖాస్తు ఫారాలను అన్ని తపాలా కార్యాలయాల్లో పొందవచ్చు లేదా www.indiapost.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 13వ తేదీలోపు జిల్లా కేంద్రాల్లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి నేరుగా గానీ, స్పీడ్ పోస్టు ద్వారా గానీ పంపాలి.
మొదటి దశ (ఈనెల 28): ఇందులో ఒక రాత పరీక్షతో పాటు, ఫిలాటెలీ ప్రాజెక్టు వర్క్ (తపాలా బిళ్లల సేకరణ) ఉంటుంది. రాత పరీక్షలో చరిత్ర, క్రీడలు, సైన్స్, సోషల్, స్టాంపులు, జనరల్ నాలెడ్జ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
రెండో దశ (నవంబరు 14): మొదటి దశలో ఎంపికైన వారికి మరో రాత పరీక్ష నిర్వహిస్తారు.
ఫలితాలు (డిసెంబరు 1): తుది ఫలితాలను ప్రకటించి, విజేతలను ఎంపిక చేస్తారు.
ఉపకార వేతనం పొందేదిలా : తుది ఫలితాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పేరు మీద సమీపంలోని తపాలా కార్యాలయంలో జాయింట్ సేవింగ్స్ ఖాతా తెరవాలి. తపాలా శాఖ ఈ ఖాతాలోనే నేరుగా ఏడాదికి రూ.6,000 ఉపకార వేతనాన్ని జమ చేస్తుంది. “ఈ పోటీలు విద్యార్థుల ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు దోహదపడతాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని సూర్యాపేట తపాలా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు.
తపాలా శాఖ అందిస్తున్న మరో భరోసా: ప్రమాద బీమా : విద్యార్థులకే కాకుండా, సామాన్య ప్రజల కోసం కూడా తపాలా శాఖ అత్యంత చౌకైన ప్రమాద బీమా పాలసీలను తీసుకొచ్చింది.
పాలసీ వివరాలు: ఏడాదికి కేవలం రూ.549 ప్రీమియంతో రూ.10 లక్షల బీమా, రూ.749 ప్రీమియంతో రూ.15 లక్షల బీమా పాలసీలను అందిస్తోంది.
ప్రయోజనాలు: ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం ఏర్పడితే పూర్తి బీమా వర్తిస్తుంది. ప్రమాద వైద్య ఖర్చుల కోసం ఓపీడీ కింద రూ.30,000 వరకు, ఐపీడీ కింద రూ.60,000 వరకు పొందవచ్చు. ఇద్దరు పిల్లల చదువుల కోసం గరిష్ఠంగా రూ.లక్ష వరకు విద్యా ప్రయోజనం లభిస్తుంది. మృతుని అంత్యక్రియలకు రూ.5,000, కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చులకు రూ.25,000 వరకు చెల్లిస్తారు.


