భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న తెలంగాణ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పేరుగాంచిన శ్రీ సీతారాముల వారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. ఆలయంలో రాష్ట్రపతి పర్యటించే సమయంలో ఉండే సిబ్బంది జాబితాను జిల్లా కలెక్టర్ అనుదీప్ సేకరిస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వారందరికీ ఆదేశాలు జారీ చేయనున్నారు. అలాగే విలేకరులతో పాటు ఇతరులెవరూ డ్రోన్ కెమెరాలను వినియోగించవద్దని భద్రాచలం పోలీసు అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో.. సారపాకలోని హెలీప్యాడ్ నుండి భద్రాద్రి రామాలయం వరకు ఉన్న వీధులు, సమీప ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి. హెలీప్యాడ్ సమీపంలో ఉన్న ఐటీసీ ఉద్యోగుల కాలనీలో డిసెంబర్ 27 నుంచే రాకపోకలపై ఆంక్ష లు విధించనున్నట్లు ఐటీసీ హెస్ఆర్ డిప్యూటీ మేనేజర్ పేరిట సర్క్యులర్ జారీ చేశారు. డిసెంబర్ 28వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యక్తులు, వాహనాల రాకపోకలపై భద్రాచలంలో పూర్తిగా నిషేధం ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర రాక పోకలను సైతం 3-4 గంటల పాటు నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. భద్రాద్రి రామాలయం పరిసరాలలోని లాడ్జీలను 27 మధ్యాహ్నం నుంచి 28 సాయంత్రం వరకు మూసివేయాలని, ఎవరికీ గదులను అద్దెకు ఇవ్వొద్దని పోలీసు అధికారులు ఆయా లాడ్జీలు, దుకాణాలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే స్థానిక ప్రజాప్రతినిధుల వివరాలు తెలియాల్సి ఉంది.
రామప్పలోనూ భద్రత కట్టుదిట్టం
ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్న నేపథ్యంలో.. అక్కడ కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మూడు హెలీ ప్యాడ్ లను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ముందుగా కేంద్రబలగాలు ఆలయానికి వచ్చి..తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి. బాంబ్ స్క్వాడ్ తో హెలీప్యాడ్ లు, ఆలయ పరిసరాలు, ఆలయం లోపల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తంమీద తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, కఠిన ఆంక్షల నడుమ సాగనుంది.