Dalits outcast in Telangana:తెలంగాణలో కుల వివక్ష మరోసారి పడగ విప్పింది. మనిషి రాకెట్ వేగంతో దూసుకుపోతున్న కంప్యూటర్ యుగంలో కూడా కులాన్ని పట్టుకువేలాడుతున్నాడనడానికి ఇది మరో నిదర్శనం. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో గణపతి ఉత్సవాలకు రూ. 1,116 రూపాయలు చందా ఇవ్వలేదన్న కారణంతో నాలుగు దళిత కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించారు. అంతటితో ఆగకుండా వెలివేసిన కుటుంబాలతో మాట్లాడితే రూ. 25 వేల రూపాయల జరిమానా విధిస్తామంటూ ఊర్లో డప్పు చప్పుల్లతో దండోరా వేయించారు. కులం కట్టుబాట్లు కాదని ఎవరైనా మాట్లాడినట్లు తెలిస్తే సమాచారం ఇచ్చిన వారికి రూ. 5వేల నజరానా కూడా ప్రకటించారు. పెద్ద మనుషుల సమక్షంలో కాళ్ళా వేళ్ళ పడినా కనికరించకపోవడంతో చివరికి చేసేదేం లేక బాధిత కుటుంబాలు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని వేడుకున్నారు.



