Private Colleges Plan Strike From November 3 Over Fee Reimbursement: విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నవంబర్ ౩ నుంచి నిరవదిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అసత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయించింది. బకాయిల చెల్లింపుల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ఉన్నత విద్యా సమాఖ్య పేర్కొంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని గుర్తు చేసింది. కాగా, ప్రభుత్వం దసరా పండుగకు రూ. 600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి కేవలం రూ. 200 కోట్లు మాత్రమే విడుదల చేయడాన్ని కాలేజీలు తప్పుబడుతున్నాయి. అలాగే, దీపావళి నాటికి మొత్తం చెల్లిస్తామని చెప్పినప్పటికీ, ఆ హామీ కూడా నెరవేరలేదని గుర్తు చేస్తున్నాయి. బకాయిల విడుదలపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే సమాఖ్య ప్రతినిధులు మంత్రులను కలిసి తమ సమస్యను వివరించినప్పటికీ.. సానుకూలమైన హామీ లభించకపోవడంతో బంద్‌కు దిగక తప్పడం లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు ఈ నిరసనను మరింత తీవ్రతరం చేయాలని యోచిస్తున్నాయి.
చలో హైదరాబాద్ కార్యక్రమంతో నిరసన హోరు..
ఈ నిరసనల్లో భాగంగా నవంబర్ మొదటి వారంలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందితో కలిసి ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమాఖ్య ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ ఉన్నత విద్యా సంఘాల సమాఖ్య వివరాల ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో 15 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎడ్, నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్నారు. ఈ విద్యార్థులలో ఎక్కువ మంది ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి చదువుతున్నారు. బకాయిలు నిలిచిపోవడం వల్ల కళాశాలల నిర్వహణ భారంగా మారిందని, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సరైన సిబ్బంది లేక బోధనా ప్రమాణాలు దెబ్బతిని.. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఈ నిరసన కార్యాచరణను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నేడు (ఆదివారం) జనరల్ బాడీ మీటింగ్‌ను నిర్వహించింది. ప్రభుత్వం ఈ సమస్యపై సానుకూలంగా స్పందించకపోతే.. రాష్ట్రంలోని ఉన్నత విద్య స్తంభించిపోయే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని సమాఖ్య హెచ్చరించింది.


