Property disputes over deceased parents : తల్లి శవం ఇంట్లో.. కూతుళ్లు ఆస్తి పంచాయితీలో..! తండ్రి మృతదేహం పక్కన.. కొడుకుల వాటాల వాగ్వాదం! వినడానికే ఒళ్లు జలదరించే ఈ ఘటనలు, ఇప్పుడు మన తెలుగు నేలపైనే జరుగుతున్నాయి. కన్నవారికి కడసారి వీడ్కోలు పలకాల్సిన చేతులే, వారి ఆస్తుల కోసం శవాల వద్ద బేరసారాలాడటం, మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోయాయో కళ్లకు కడుతోంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఇటీవల వెలుగుచూసిన ఈ ఘటనలు, సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి.
అసలేం జరిగిందంటే? గుండెల్ని పిండేసే ఘటనలు : సూర్యాపేటలో..: ఇటీవల ఓ మండలంలో, తల్లి మరణించగా, ఆస్తి తేల్చే వరకు అంత్యక్రియలు జరపమని ఇద్దరు కుమార్తెలు భీష్మించుకు కూర్చున్నారు.
యాదాద్రిలో..: గత సంవత్సరం మోత్కూరు మండలంలో, తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా, ఆస్తి కోసం కుటుంబ సభ్యులు గొడవపడ్డారు.
మరోచోట..: సూర్యాపేట పట్టణంలో, తండ్రి శవం వద్ద రోజంతా కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టి, చివరికి దినకర్మ కూడా నిర్వహించలేదు. ఈ ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే… (డబ్బు) ముందు, కన్నప్రేమ, కడసారి వీడ్కోలు చిన్నబోతున్నాయనడానికి ఇవి నిలువుటద్దాలు.
ఎందుకీ పతనం? కారణాలేంటి : “మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే” అన్న కార్ల్ మార్క్స్ మాటలు నేటి సమాజంలో అక్షర సత్యాలవుతున్నాయి. ఈ సామాజిక పతనానికి అనేక కారణాలున్నాయని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
విలువల కొరత: చిన్నతనం నుంచే పిల్లలకు మానవీయ విలువలు, పెద్దలను గౌరవించడం నేర్పకపోవడం.
డబ్బుపై మోజు: తల్లిదండ్రుల ప్రవర్తనలోనే స్వార్థం, డబ్బు పట్ల విపరీతమైన ఆరాధన ఉండటం, పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఆధునిక జీవనశైలి: సోషల్ మీడియా, వ్యక్తిగత స్వేచ్-ఛ పేరుతో కుటుంబ బంధాలకు ప్రాధాన్యత తగ్గిపోవడం.
బాధ్యతారాహిత్యం: సేవాభావం, బాధ్యత వంటి గుణాలు లోపించడం.
“ఆస్తులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, తల్లిదండ్రుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. వారికి చివరిసారి గౌరవం ఇవ్వడంలో కూడా మనం విఫలమైతే, మానవత్వం ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం.”
– డాక్టర్ భవాని, మానసిక నిపుణురాలు, మిర్యాలగూడ
పరిష్కార మార్గమేది : ఈ సామాజిక రుగ్మతకు పరిష్కారం మన ఇళ్లలోనే, మన పెంపకంలోనే ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు చిన్నతనం నుంచే బంధాల విలువను, పెద్దలను గౌరవించడాన్ని నేర్పించాలి. ఆస్తి కంటే అనుబంధాలే గొప్పవని ఆచరణలో చూపించాలి. కుటుంబంలో విభేదాలను సంయమనంతో, ప్రేమతో పరిష్కరించుకోవాలి. డబ్బు జీవితానికి అవసరమే, కానీ డబ్బే జీవితం కాదు. ఈ సత్యాన్ని మనం, మన పిల్లలకు నేర్పించనంత కాలం, ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి.


