Safe public commuting practices : ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజా రవాణా మనకు ఓ వరం. కానీ, అదే వరం కొందరి అజాగ్రత్త, ఆత్రం కారణంగా శాపంగా మారుతోంది. బస్సు రాగానే ఒకరినొకరు తోసుకుంటూ, కదులుతున్న వాహనంలోనే ఎక్కేస్తూ, దిగిపోతూ ఎందరో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సుల్లో రద్దీ పెరగడంతో ఈ దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి. అసలు మనకెందుకీంత ఆత్రం? నిమిషం ఆలస్యమైతే నష్టపోయేది ఏమిటి? మన ప్రాణాల కంటే సమయం అంత విలువైందా? చిన్నపాటి క్రమశిక్షణ, ఒకరికొకరు సహకరించుకోవడం అనే కనీస బాధ్యతను మనం ఎందుకు మరిచిపోతున్నాం? ఈ ప్రమాదకర ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే జరిగే అనర్థాలకు బాధ్యులెవరు?
“క్యూ పద్ధతి పాటించండి, మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోండి” అని అధికారులు, సిబ్బంది మొత్తుకుంటున్నా ప్రయాణికుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఫలితంగా బస్సులు, మెట్రో స్టేషన్లలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కేవలం చిన్నపాటి నిర్లక్ష్యం, నిబంధనలను పెడచెవిన పెట్టడమే ఈ అనర్థాలకు ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అజాగ్రత్తే ప్రమాదాలకు అసలు కారణం : రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక, ముఖ్యంగా మహిళలు సీట్ల కోసం పడే ఆరాటంలో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
తోపులాటలు: బస్సు ఆగగానే ఒక్కసారిగా ఎగబడటం, ఒకరినొకరు తోసుకోవడంతో వృద్ధులు, పిల్లలు కిందపడి గాయపడుతున్నారు.
కదులుతున్న బస్సుతో పరుగు: వాహనం పూర్తిగా ఆగకముందే పరిగెత్తుకెళ్లి ఎక్కడం, గమ్యం రాగానే పూర్తిగా ఆగకముందే దూకి దిగడం వంటి సాహసాలు ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి.
ఫుట్‌బోర్డు ప్రయాణం: బస్సులో చోటు లేకపోయినా ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణించడం అత్యంత ప్రమాదకరం. డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు పట్టుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఫోన్‌తో పరధ్యానం: సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సు ఎక్కడం, దిగడం వల్ల దృష్టిమరలి ప్రమాదాలకు గురవుతున్నారు.
నిపుణుల మాట.. నిబంధనలే మనకు కోట : ప్రమాదాలను నివారించడానికి రాకెట్ సైన్స్ అవసరం లేదు, కనీస క్రమశిక్షణ పాటిస్తే చాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా కొన్ని నియమాలు పాటిస్తే ప్రయాణం సుఖమవడమే కాకుండా, సురక్షితంగా గమ్యం చేరవచ్చు.
వరుస క్రమమే రక్ష: బస్సు, రైలు, మెట్రో ఏదైనా సరే, క్యూ పద్ధతి పాటించడం ప్రాథమిక కర్తవ్యం. దీనివల్ల తోపులాటలకు ఆస్కారం ఉండదు.
ఓపికే ప్రాణ రక్ష: వాహనం పూర్తిగా ఆగిన తర్వాతే ప్రశాంతంగా ఎక్కాలి, దిగాలి.
ఇతరులకు గౌరవం: వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వడం మన సంస్కారం.
ప్రయాణంలో సంయమనం: ఫుట్‌బోర్డు ప్రయాణం చేయకపోవడం, సెల్‌ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకపోవడం, పెద్ద శబ్దంతో పాటలు వినకపోవడం తోటి ప్రయాణికులకు మనం ఇచ్చే గౌరవం.
విదేశాల్లో క్రమశిక్షణ.. మనం నేర్చుకోవాలి : ప్రజా రవాణాలో క్రమశిక్షణకు అభివృద్ధి చెందిన దేశాలు పెట్టింది పేరు. వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
ఇంగ్లాండ్: బస్సు కోసం గంటల తరబడి అయినా ఓపిగ్గా క్యూలో నిలబడతారు. బస్సుల్లో తినడం, తాగడం నిషేధం.
జపాన్: ప్రజా రవాణాలో ఫోన్ కాల్స్ మాట్లాడటం చాలా అరుదు. మొబైల్‌ను ‘మానర్ మోడ్’లో ఉంచి, నిశ్శబ్దాన్ని పాటిస్తారు.
సింగపూర్: శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. బస్సుల్లో చూయింగ్ గమ్ నమలడం కూడా నిషేధం.
తైవాన్: వృద్ధులు, గర్భిణుల కోసం కేటాయించిన సీట్లలో అర్హులు లేకపోతే, ఆ సీట్లను ఖాళీగా వదిలేస్తారే తప్ప ఇతరులు కూర్చోరు.


