Sunday, January 18, 2026
HomeతెలంగాణPaper leakage case: సంచలనం రేపుతున్న ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం.. 35 మంది విద్యార్థులపై...

Paper leakage case: సంచలనం రేపుతున్న ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం.. 35 మంది విద్యార్థులపై చర్యలు

Question paper leakage case: ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పేపర్‌ లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. అదేవిధంగా, బీఎస్సీ(అగ్రికల్చర్) ఫైనలియర్‌ చదువుతున్న 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేస్తూ వీసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని తిరిగి వ్యవసాయ శాఖకి పంపిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రశ్నా పత్రాలు లీకవుతున్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో ఇటీవల వీసీ ప్రొఫెసర్ అల్డాస్ జానయ్య, ఇతర అధికారులతో కలసి జగిత్యాల వ్యవసాయ కళాశాలని సందర్శించారు. వివిధ రకాల రికార్డుల పరిశీలించి, సీసీ ఫుటేజీల ఆధారంగా సెమిస్టర్ ఫైనల్ పరీక్షా ప్రశ్న పత్రాలు లీకవుతున్నట్లు అనుమానించారు. ఈ అంశాన్ని సమగ్రంగా విచారించేందుకు ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ వివిద కోణాల నుంచి విచారణ చేపట్టి.. పేపర్‌ లీకేజీ జరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖలో ఏఈఓలుగా పని చేస్తూ.. వర్సిటీలో ఇన్ సర్వీస్ కోటాలో 3వ ఏడాది బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సుమారు 35 మంది అభ్యర్థులకు పేపర్‌ లీకైందని గుర్తించారు. వారందరినీ డిస్మిస్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక పథకం ప్రకారం సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్న పత్రాలను వర్సిటీ సిబ్బంది సహకారంతో లీకు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై వర్సిటీ అధికారుల నుంచి ఫిర్యాదులు అందడంతో చర్యలకు ఉపక్రమించారు.

- Advertisement -

వాట్సాప్‌ గ్రూప్‌లలో ప్రశ్నాపత్రాలు సర్క్యులేట్‌..

వాట్సాప్ గ్రూప్‌లలో ఇతర వ్యవసాయ కళాశాలల విద్యార్థులకి పంపుతున్నారని, ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిందని అధికారులు తేల్చారు. ఒక పథకం ప్రకారం కొన్నేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతోందని నిర్ధారించారు. వర్సిటీ ఈ అంశాన్ని చాలా తీవ్రం గా పరిగణిస్తూ ఒక ఉన్నతాధికారి సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా వ్యవసాయ శాఖ నుంచి ఇన్ సర్వీస్ కోటాలో వచ్చిన సుమారు 35 మందిని డిస్మిస్ చేస్తూ వారిని వ్యవసాయ శాఖకి తిరిగి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014 నుంచి 2024 వరకూ పూర్తి స్థాయిలో విశ్వ విద్యాలయంలో ఉన్నత అధికారులు లేకపోవడంతో ఎన్నో అవకతవకలు జరిగాయని, ప్రశ్న పత్రాల లీకేజీ కుంభకోణం అందులో ఒకటని ఉప కులపతి అల్డాస్ జానయ్య పేర్కొన్నారు. ఈ క్రమంలో వెంటనే ప్రక్షాళన మొదలు పెట్టి బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News