ఇల్లందకుంట ఎంపీడీవో కార్యాలయంలో రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎంపీడీవో శంకరయ్య పతకావిష్కరణ చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు హాజరైన ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ మాట్లాడుతూ… భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన తదనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా కమిటీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని అన్నారు.
భారతదేశ పౌరులైన ప్రతి ఒక్కరికి బాధ్యతలతో పాటు హక్కులు కూడా పొందుటకు, అన్ని రంగాలలో రిజర్వేషన్ కల్పించుటకు ఈ రాజ్యాంగం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన విద్యార్థిని, విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులను ఎంపీపీ పావని వెంకటేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోటపోతుల అయిలయ్య, ఎంపీటీసీ సభ్యులు తెడ్ల ఓదెలు, ఎక్కటి సంజీవరెడ్డి, దాంసాని విజయకుమార్, చినరాయుడు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.