R Krishnaiah Comments on BC Reservations: బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే తన జీవిత లక్ష్యమని జాతీయ బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. బీసీ రాజ్యాధికారమే తన చివరి కోరిక అని ఆయన స్పష్టం చేశారరు. బీసీలకు విద్యా, ఉద్యోగాలు, చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని, ఈ ఉద్యమం తెలంగాణ నుంచే ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు. బీసీ ఉద్యమానికి తెలంగాణ దిక్సూచిగా మారనుందని, ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతమవుతుందని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల నిర్వహించిన ‘బీసీ బంద్’ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 350 మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆర్. కృష్ణయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బీసీల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా తన నాయకత్వంలో బీసీ జేఏసీని ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ లక్ష్యం నెరవేరేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.
బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం తర్జనభర్జన..
కాగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. ఈ డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు గానూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. అనంతరం ఆ బిల్లును గవర్నర్‌కు పంపించింది. ఈ బిల్లు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే, రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ రెడ్డి సంఘం ప్రతినిథులు హైకోర్టు, సుప్రీం కోర్టు తలుపు తట్టారు. దీంతో, వాదోపవాదలను విన్న హైకోర్టు, సుప్రీం కోర్టు గత తీర్పుల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లొచ్చని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. హైకోర్టు తీర్పును బీసీ సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. ఆర్ క్రిష్ణయ్య అధ్వర్యంలో హైకోర్టు ఎదుటే ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 19న బీసీ బంద్ చేపట్టారు. ఈ బీసీ బంద్‌లో అన్ని పార్టీలు మద్ధతు ప్రకటించాయి. అన్ని పార్టీల్లోని బీసీలు బంద్‌లో పాల్గొన్నారు. అయితే, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం వెనక్కి తగ్గితే ఊరుకునేదే లేదని, ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు. “మేమెంతో, మాకంత” అనే నినాదంతో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఏదేమైనా, బీసీ రిజర్వేషన్ల రగడ రాష్ట్ర వ్యాప్తంగా హీటెక్కిస్తోంది.


