మీర్పేట్ హత్య కేసు(Meerpet Murder Case)పై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(CP Sudheer Babu) ప్రెస్ మీట్ పెట్టారు. నిందితుడు గురుమూర్తిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. భార్యను అతి క్రూరంగా చంపినా కూడా గురుమూర్తిలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. ఇంత క్రూరంగా ఒక మనిషి మీద పగపెంచుకొని చంపుతారా? అని షాకయ్యామని తెలిపారు. దర్యాప్తులో నిందితుడు చెబుతున్న విషయాలు విని తాము కూడా నివ్వెరపోయామని పేర్కొన్నారు.
మాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటర్ హీటర్‌తో నీళ్లలో మరిగించాడని.. ఉడికించిన ముక్కలను మళ్లీ స్టవ్‌పై మంటల్లో కాల్చాడని చెప్పారు. కాల్చిన ముక్కలను పొడిగా మార్చి బూడిదను పెయింట్ బకెట్లో తీసుకెళ్లి చెరువులో పోసి వచ్చాడని వివరించారు. అనంతరం పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడని.. అమ్మ ఏది అని పిల్లలు అడిగితే ఎక్కడికి వెళ్లిందో తెలియదు అని చెప్పాడన్నారు. భార్యను చంపాలని గట్టిగా నిర్ణయించుకున్న తర్వాతే పిల్లను బంధువుల ఇంటి వద్ద వదిలి వచ్చాడన్నారు. ఈనెల 16న భార్యతో ఘర్షణకు దిగి ఆమె తలను గోడకేసి కొట్టి.. గొంతుపిసికి చంపాడన్నారు. గురుమూర్తి చాలా క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తి అని..గతంలో ఆర్మీలో పనిచేసిన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని తెలిపారు. చంపినట్లు భౌతిక ఆధారాలు లేకుంటే.. కేసు నుంచి తప్పించుకోవచ్చని భావించాడని..కానీ టెక్నాలజీతో కొన్ని ఆధారాలు సేకరించామని సీపీ వెల్లడించారు.