కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఈనెల 27న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో ఈ ఇద్దర నేతలు పాల్గొంటారని తెలిపింది.
కాగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరసనలు వ్యక్తం చేయాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా జనవరి 26, 2025 నుంచి జనవరి 26, 2026 వరకు దేశవ్యాప్తంగా ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు రావడంతో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.