Rahul Gandhi arrives in Hyderabad to watch football match: హైదరాబాద్ నగరం నేడు అరుదైన క్రీడా, రాజకీయ వేడుకకు సిద్ధమైంది. ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సి నగరానికి విచ్చేస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్‌తో కలిసి మెస్సీ ఫుల్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ అరుదైన దృష్యం కోసం తెలంగాణతో పాటు యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో అటు క్రీడాభిమానుల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఈ భారీ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.
రాహుల్ గాంధీకి ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
ఇవాళ (శనివారం) మధ్యాహ్నం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరపున ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నేరుగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. రాహుల్ రాకతో ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి రాహుల్ గాంధీ నేరుగా చారిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్‌కు బయలుదేరారు. అక్కడ నిర్వహించబోయే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, కీలక నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రస్తుత రాజకీయ అంశాలపై ఈ సందర్భంగా పార్టీ నేతలతో చర్చలు జరపనున్నారు. దీంతో, ప్యాలెస్ పరిసరాల్లో సందర్శకుల తాకిడి పెరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
ఉప్పల్ వేదికగా మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్..
మరోవైపు, ఫుట్‌బాల్ ప్రపంచ రారాజు లియోనెల్ మెస్సి మరికాసేపట్లో హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించబోయే ఫుట్‌బాల్ మ్యాచ్ క్రీడా ప్రేమికులకు కనువిందు చేయనుంది. మెస్సి రాకను పురస్కరించుకుని స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్లోబల్ ఐకాన్ మెస్సిని ప్రత్యక్షంగా చూడటం, సీఎం రేవంత్ గ్రౌండ్‌లోకి దిగి ఆడటం, అదే వేదికపై రాహుల్ గాంధీ వంటి అగ్రనేత హాజరుకావడం ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా.. అంతర్జాతీయ క్రీడా వేడుకలకు కేంద్రంగా మారుతోంది. మెస్సి వంటి దిగ్గజాలు రావడం వల్ల నగర ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ రాకతో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత కూడా తోడైంది. మ్యాచ్ అనంతరం రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరిగి వెళ్తారా లేక నగరంలో మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారా అనే విషయంపై స్పష్టత రానుంది.

