అహ్మదాబాద్‌లో జరిగిన 84వ కాంగ్రెస్ సమావేశంలో లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ మత స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ఐడియాలజీ రాజ్యాంగమని అందుకే బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోడీ ఒక్కొక్కటిగా అదానీ, అంబానీకి విక్రయిస్తున్నారని ఫైర్ అయ్యారు. సిమెంట్, స్టీల్, ఎయిర్‌పోర్టులు, గనులు సహా కీలక పరిశ్రమలన్నీ అదానీకే అప్పగిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
అలాగే తెలంగాణలో కుల గణన అంశంపైనా రాహుల్ మాట్టాడారు. కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి తనకు వివరించారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో ఓసీలు, బీసీలు మైనార్టీలు ఎంత అనేది తేలిందన్నారు. దీంతో దేశానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసులకు సరైన ప్రాతినిధ్యం లేదని స్పష్టమైందన్నారు. దేశ జనాభాలోని 90 శాతం మంది జనాభాకు సరైన ప్రాతినిధ్యం లేదని తెలిపారు. మైనార్టీలు, ఆదివాసులు, గిరిజనుల కోసం కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. జాతీయ జన గణన చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. 24 గంటలు ఓబీసీలు, ఆదివాసీల గురించి మాట్లాడే మోడీ ఆ వర్గాలకు మాత్రం మేలు చేయరని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను బీజేపీ రద్దు చేసిందని ధ్వజమెత్తారు.