Rain Alert In Telangana: తెలంగాణ రాష్ట్రంలో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రహదారులు జలమయమై, ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో పాటు హైదరాబాద్ నగరం మొత్తం ట్రాఫిక్ సంకెళ్ళల్లో చిక్కుకుంది. అయితే నేడు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదు రోజులు వర్షాలు మళ్లీ కొనసాగనున్నాయి. ముఖ్యంగా జూలై 20, 21 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తాజా హెచ్చరికల్లో రాష్ట్రంలోని ములుగు, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని, ఈ జిల్లాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో వరుసగా మూడు రోజులుగా వర్షం కురుస్తుండటంతో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. ఉప్పల్, మల్కాజిగిరి, హయత్‌నగర్, కాప్రా తదితర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, శనివారం సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ ప్రాంతంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చేవెళ్ల (రంగారెడ్డి)లో 11 సెం.మీ., యాదగిరిగుట్టలో 10 సెం.మీ. వర్షం పడింది. హైదరాబాద్‌లో కాప్రా 7.7 సెం.మీ., ఉప్పల్‌లో 6.8 సెం.మీ.గా నమోదైంది.
వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతేనే బయటకి రావాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగుల ప్రమాదం నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటి వరకూ నమోదవుతున్న వర్షాలు వ్యవసాయ రంగానికి అనుకూలంగా మారుతున్నాయి. వానకాలం పంటల సాగు మొదలైందని, తక్కువ నీటి వనరులున్న ప్రాంతాల్లో వర్షాలతో ఉపశమనం లభించిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా మరో మూడు నుంచి అయిదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తదితర జిల్లాల్లో ఈ వర్షాలు ఉండబోతున్నాయని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


