Today Rains: తెలంగాణలో మారో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్ప పీడన ప్రభావంతో వర్షపాతం గణనీయంగా పెరగడంతో నిన్న వరుసగా మూడో రోజు కూడా మంచి వర్షపాతం నమోదైందని తెలిపింది. ఈరోజు, రాబోయే రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ముసురుతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రుతుపవనాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మంచి వర్షాలు కురిసాయని గుర్తు చేసింది.
హైదరాబాద్ నగరంతో పాటు మొత్తం తెలంగాణ లోని చాలా చోట్ల 30-40 మి.మీ. విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
గత జూన్ నెల వర్షాల లోటు నుంచి రాష్ట్రం ఇప్పుడు వేగంగా కోలుకుంటోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం గణనీయంగా పెరిగి, వర్షాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
నేడు ఈ ప్రాంతాల్లో:
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి వంటి ఉత్తర, తూర్పు తీర ప్రాంతాలలో మధ్యాహ్నం రాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌లలో సాయంత్రం – రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెంలో కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ములుగు, భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి, జనగాం, వనపర్తి, సంగారెడ్డిలో వచ్చే 1-2 గంటల్లో తేలికపాటి – మోస్తరు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు చినుకులు పడతాయని.. సాయంత్రం – రాత్రి సమయంలో మళ్ళీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు చురుకుగా మారడానికి అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించి, రైతాంగానికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాలు ఖరీఫ్ సాగుకు కీలకమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.