Thursday, July 10, 2025
HomeతెలంగాణRajasingh: షాకింగ్.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా

Rajasingh: షాకింగ్.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా

Rajasingh Resign: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. నేడు జరిగిన బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో తనను పోటీ చేయకుండా కొందరు అడ్డుకున్నారని మండపడ్డారు. నామినేషన్ పత్రాలపై సంతకం చేయనివ్వలేదని.. తన అనుచరులను కూడా బెదిరించారని వాపోయారు. ఇక పార్టీలో ఉండలేనని తెలిపారు. పార్టీ కోసం తాను ఉగ్రవాదులకు కూడా శత్రువుగా మారానని గుర్తుచేశారు. పార్టీకి ఓ దండం అని లేఖలో పేర్కొన్నారు.

రాజాసింగ్ రాజీనామాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియ కారణంగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం అధ్యక్ష పదవి ఎంపిక గురించి ఆయన మాట్లాడుతూ.. అధ్యక్షుడిని చివరి కార్యకర్త నుంచి సీనియర్ నేతలు కలిసి ఎన్నుకోవాలని తెలిపార. అంతేకానీ ఎవరో ఒకరు ఇద్దరు నాయకులు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్ రాజీనామా చేయడం బీజేపీ కార్యకర్తలు షాక్ కు గురి అవుతున్నారు.

కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలోని కొంతమంది నేతలు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలను చీకటిలో రహస్యంగా కలుస్తూ చెత్త రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే చీకటి రాజకీయాలు చేసే నేతలను పక్కన పెట్టాలని పార్టీ పెద్దలకు సూచించారు. పార్టీలో తన మాటకు విలువ ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు.

కాగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలవడం గమనార్హం. హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పడంలో ముందుంటారు. హనుమాన్ శోభాయాత్ర, గణేశ్ నిమజ్జనం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్లొంటారు. పక్కా హిందూత్వ వాదిగా రాజాసింగ్ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అలాంటి నేత హిందూత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీకి రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News