రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీతో పాటు, వేములవాడలో ఎస్టీఓ కార్యాలయలలో జరుగుతున్న అవినీతి భాగోతంపై విచారణ చేపట్టాలని పిఆర్టీయు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యాడారం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి కె హరేందర్ రెడ్డి అన్నారు.
అధికారులు పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి, దోషులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు హక్కుగా, సక్రమంగా పొందాల్సిన బిల్లులపై వసూళ్లకు పాల్పడటం, చేతులు తడపనిదే బిల్లులు అప్ లోడ్ చేయకపోవడం అన్యాయం అన్నారు. బాధితులను మానసికంగా ఇబ్బంది పెట్టడం సిగ్గు చేటన్నారు. బాధితులైన రిటైర్డ్ ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా నిలవాల్సిన కొందరు సంఘ నాయకులు, అవినీతికి పాల్పడిన అధికారులకు వత్తాసు పలకడం అన్యాయం అన్నారు. దీనికి సంబంధం ఉన్న ప్రతీ సంఘ నాయకులపై విచారణ చేపట్టి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి అని హరికృష్ణ అన్నారు. వీరి వెంట రాష్ట్ర బాధ్యులు పి. సత్యనారాయణ, జిల్లా బాధ్యులు ఎస్.రమేష్, జి.సత్యం, జి. శ్రీనివాస్, వై వెంకట రమణ,హెచ్ శిరోమణి, ఎం సరోజ ఉన్నారు.