Hyderabad Liberation Day celebrations: సెప్టెంబర్ 17 సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. 1948లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన రోజును ఏమని పిలవాలనే అంశంపై ప్రధాన పార్టీల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. బీజేపీ ఈ రోజును ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ అని పిలుస్తుండగా, ఇతర పార్టీలు విలీనం లేదా విద్రోహ దినంగా పేర్కొంటున్నాయి.
బీజేపీ భారీ ఏర్పాట్లు: బీజేపీ ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించనుంది. కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న బీజేపీ, ఈసారి కూడా భారీ ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మీ కవాతు, సాంస్కృతిక నృత్యాలతో ‘హైదరాబాద్ లిబరేషన్ డే’ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/maoist-partys-historic-move-ready-to-drop-weapons-for-peace/
రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య ప్రసంగం: ఉదయం 8.55 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు రాజ్‌నాథ్ సింగ్ చేరుకోనున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం సీఆర్పీఎఫ్‌తో పాటుగా ఇతర బలగాలు నిర్వహించిన పరేడ్‌ను వీక్షిస్తారు. పారామిలటరీ దళాల ప్రత్యేక పరేడ్ కూడా ఈ సందర్భంగా జరుగనుంది. ఈ వేడుకల అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం జూబ్లీ బస్టాండ్‌కు సమీపంలో ఉన్న కంటోన్మెంట్ పార్క్‌లో భారతరత్న మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి విగ్రహాన్ని రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించనున్నారు.
సాంస్కృతిక ప్రదర్శనలు: ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక (పూర్వ హైదరాబాద్ స్టేట్)లకు చెందిన సాంస్కృతిక బృందాలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. దేశభక్తితో కూడిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకోనున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర చౌహాన్, జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొననున్నట్లు సమాచారం.


