Telangana BJP Chief: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు ఖరారైనట్లు సమాచారం. పార్టీ భవిష్యత్ దృష్ట్యా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును అధ్యక్షుడిగా కేంద్ర పెద్దలు ఎంపిక చేశారు. ఈమేరకు నామినేషన్ వేయాలని అధిష్టానం నుంచి ఆయనకు సమాచారం వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాంచందర్ నామినేషన్ వేయనున్నారు. అనంతరం ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించనున్నారు.
రాష్ట్ర బీజేపీ నూతన సారథి విషయంతో కొంతకాలంగా జోరుగా చర్చ జరగింది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తుడంటంతో కొత్త సారథిని ఎంపిక చేయాలని అధిష్టానం భావించింది. దీంతో కీలక నేతలు ఆ పదవి దక్కించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా లాబీయింగ్ చేశారు. ముఖ్యంగా ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ వంటి నేతలు ఈ పదవిని ఆశించారు. అయితే పార్టీ పెద్దలు మాత్రం ఇందుకు వ్యతిరేకంగా పార్టీలో ఎప్పటినుంచి ఉన్న రాంచందర్ రావు వైపు మొగ్గు చూపింది.
విద్యార్థి దశ నుంచే ఆరెస్సెస్ లో పనిచేయడం రాంచందర్ కు కలిసొచ్చింది. దీంతో ఆరెస్సెస్ పెద్దలతో పాటు కొందరు సీనియర్ నేతలు రాంచందర్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అలాగే రాంచందర్ రావును పార్టీలో క్షేత్రస్థాయిలో మంచి పట్టుంది. పార్టీలోని అన్ని వర్గాలతో సఖ్యత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అయితే పార్టీలో అందరిని కలుపుకుని ముందుకు పోతారని అధిష్టానం భావించిందని చెబుతున్నారు.
మరోవైపు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యారు. అనంతరం రాంచందర్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రణాళికలు రచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాంచందర్ రావును ఎంపిక చేసినట్లు కమలం నేతలు చర్చించుకుంటున్నారు. కాగా నూతన అధ్యక్షుడిగా రాంచందర్ రావు పేరు ఖరారు కావడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు రామచందర్ రావుకు అభినందనలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.