BJP Telangana President: తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఎన్.రామచంద్రరావుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామచంద్రరావు పార్టీ కార్యకర్తగా, విద్యార్థి నాయకుడిగా మొదలుకుని పార్టీ శ్రేణుల్లో అనేక కీలక పాత్రలు పోషించిన సమర్థ నాయకుడని కొనియాడారు. కష్టపడే, నిబద్ధత కలిగిన నాయకుడిగా రామచంద్రరావు పేరుగాంచారని పేర్కొన్నారు.
సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందిస్తూ.. కావాలనే కొందరు రామచంద్రరావుపై విమర్శలు చేస్తున్నారని, ఇదే పరిస్థితిని గతంలో మోదీ సహా తామూ ఎదుర్కొన్నామని అన్నారు. అయితే కాలం తమ తమ నిజాయితీని నిరూపించిందని, తప్పుడు ఆరోపణలు చేసినవారు ప్రస్తుతం కనపడకుండా పోయారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రామచంద్రరావు వ్యక్తిగత పోరాటం గురించి ఎంతో భావోద్వేగంతో చెప్పారు బండి సంజయ్. ఆయన కాళ్లకు తగిలిన గాయాల గురించి అడిగినప్పుడు వచ్చిన సమాధానం తనని చలింపజేసిందని చెప్పారు. విద్యార్థి దశలో రాడికల్స్ చేసిన దాడుల వల్ల ఆయన శారీరకంగా ఎంతో గాయపడినా.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లిన ఉద్యమ నాయకుడని గుర్తు చేశారు. అధ్యక్ష పదవిపై బీజేపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఎవరైనా పదవులు ఆశించొచ్చని, కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండటం కీలకమని హితవు పలికారు.
ప్రజాసంగ్రామ యాత్రలో ఎదురైన దాడులపై గుర్తు చేస్తూ, కార్యకర్తలే తమకు రక్షణగా నిలిచారని చెప్పారు. తమపై వచ్చిన కేసుల్లో రామచంద్రరావు న్యాయపరంగా సహాయం చేసి బయటకు తీసిన ఘనత తనదేనని తెలిపారు. బీజేపీ లక్ష్యం మోదీ పాలనను, రామరాజ్యాన్ని తీసుకురావడమే అని అన్నారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగిరే రోజు కోసం బీజేపీ పనిచేస్తోందని చెప్పారు. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు విరక్తి చెంది, బీజేపీకి అవకాశమివ్వాలని భావిస్తున్నారని పేర్కొన్నారు.
బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు. బీసీ నాయకులను రాష్ట్రాధ్యక్షులుగా చేసిన ఘనత బీజేపీదేనని, తాను, దత్తాత్రేయ, లక్ష్మణ్ వంటి నేతలకు అవకాశం ఇచ్చిన పార్టీ ఇదేనని గుర్తుచేశారు. కాగా, కేసీఆర్ గతంలో చెప్పిన “దళితుడిని సీఎం చేస్తా” అన్న మాటపై నిలబడలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు వంటి అనేక అవినీతి కేసులపై సీబీఐ విచారణ జరగాల్సిన అవసరముందని అన్నారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం దానికి భయపడుతోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అన్నీ ప్రజలను మోసం చేసేందుకేనని అభిప్రాయపడ్డారు. ప్రజా వ్యతిరేక పాలనను ఎదుర్కొనడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ సరైన సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రంలో వంద స్థానాల గెలుపు సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. “బీజేపీలో గ్రూపులున్నాయని చెప్పేవారు అబద్ధం చెబుతున్నారు. మన అందరం ఒకే జట్టు, మోదీనే మన కెప్టెన్” అని అన్నారు. రామచంద్రరావు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లోనూ కీలకంగా పనిచేశారని గుర్తు చేస్తూ, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ విజయభేరి మోగించాల్సిందని పేర్కొన్నారు.