Ramachandra Rao Takes Charge: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణకు ముందు తన నివాసంలో వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
అనంతరం సీనియర్ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌రావుతో పాటు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఉస్మానియా వర్సిటీలోని సరస్వతీ దేవాలయంలో పూజలు నిర్వహించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసి చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాషాయ నేతలు ఆయనను గజమాలతో సత్కరించారు.
రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపిక కావడంపై తనపై వస్తున్న విమర్శలకు రామచందర్ రావు గట్టిగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను డమ్మీ లీడర్‌నా.. కాదా..? త్వరలోనే చూపిస్తా అని హెచ్చరించారు. తెలంగాణలో తన కంటే ఫైర్ బ్రాండ్ ఎవరు లేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది పెద్ద బాధ్యత అని పేర్కొన్నారు. తమకు కాంగ్రెస్ పార్టీతోనే పోటీ అని.. బీఆర్ఎస్ పార్టీతో కాదన్నారు. పార్టీలో అందరినీ కలుపుకుపోవాలనే ఉద్దేశంతోనే కూల్‌గా ఉంటున్నానన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. చొక్కా గుండీలు విప్పి బూతులు మాట్లాడితేనే అగ్రెసివ్ లీడర్ కాదని చెప్పుకొచ్చారు.
కాగా రామచందర్ రావు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమ్మెల్యే, ఎంపీగా కూడా పోటీ చేశారు. హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కీలక నేతలను కాదని వృత్తిరీత్యా లాయర్ అయిన రామచందర్ రావుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం విశేషం.