Sunday, September 8, 2024
HomeతెలంగాణRamagundam: కొత్త కమిషనరేట్ భవనం ప్రారంభం

Ramagundam: కొత్త కమిషనరేట్ భవనం ప్రారంభం

రామగుండం పరిధిలో అధునాతన హంగులతో నూతనంగా జి ప్లస్ -2 పద్ధతిలో నిర్మించిన పోలీస్ కమిషనరేట్ భవనాన్ని మంత్రి కేటీఆర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరిని సిపి ఛాంబర్లో కుర్చీలో కూర్చోపెట్టి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రి వెంకటేష్ నేత, విప్ బాల్క సుమన్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ప్రజలంతా శాంతియుతమైన జీవితం గడిపేందుకు దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుడితో సమానంగా అంతర్గత భద్రత కోసం మన పోలీసులు పని చేస్తున్నారని మంత్రి అన్నారు. పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తూ పకడ్బందీగా శాంతి భద్రతలను నిర్వహిస్తున్నందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కుమిలిపోతూ ఆవేదనతో పనిచేసేవారని, ఉద్యమం కోసం పోలీస్ కానిస్టేబుల్ కృష్ణయ్య తన ప్రాణాలను బలిదానం చేసుకున్న ఘటన దానికి నిదర్శనమని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత పోలీస్ అమరవీరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నా మని, ఉద్యోగం అందించడంతో పాటు కృష్ణయ్య కుమార్తె ప్రియాంకను డాక్టర్ చదివించామని, ఆమె కరీంనగర్ బస్తి దవాఖానాలో డాక్టర్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తుందని తెలిపారు. అమరవీరుడు పోలీస్ కృష్ణ కుటుంబాన్ని కాపాడుకున్న తీరుతో ప్రతి పోలీస్ కుటుంబానికి ఒక సందేశం పంపమని అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటుపై శాంతి భద్రతలకు సంబంధించి అనేక సందేహాలు, అపోహలు వచ్చాయని, మత ఘర్షణలు, నక్సలైట్ సమస్య అధిక మవుతుందని, పెట్టుబడులు రావని, నాయకత్వ సమస్య అపోహలను పటాపంచలు చేస్తూ అన్ని రంగాలలో దేశానికే ఆదర్శవంతంగా తెలంగాణ నిలిచిందని మంత్రి అన్నారు. ప్రజా అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ పాలన సాగుతుందని, తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే విధంగా మనపాలసీలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్. ఐపిఎస్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ లా & ఆర్డర్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇందుకు నిదర్శనం పోలీస్ శాఖకు అత్యధిక నిధులు కేటాయించారు. ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో అక్కడికే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశానికే రోల్ మోడల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరకంటి రామ్ చందర్, పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, పోలీస్ కార్పొరేషన్ ఎండి రాజీవ్ రతన్, డీజిపి అంజనీ కుమార్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, పెద్ధపల్లి డీసీపీ ఎడ్ల మహేష్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, జైపూర్ ఏసీపీ నరేందర్, పోలీస్ ఉన్నత అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News