Saturday, November 15, 2025
HomeతెలంగాణRamagundam Temple Demolition: రామగుండంలో ఆలయాల కూల్చివేతపై బండి సంజయ్‌ ఆగ్రహం.. పునర్నిర్మించాలని అధికారులకు అల్టిమేటం..!

Ramagundam Temple Demolition: రామగుండంలో ఆలయాల కూల్చివేతపై బండి సంజయ్‌ ఆగ్రహం.. పునర్నిర్మించాలని అధికారులకు అల్టిమేటం..!

Ramagundam Temple Demolition Bandi Sanjay Comments: రామగుండంలో దారి మైసమ్మ ఆలయాల మూకుమ్మడి కూల్చివేత రాజకీయ రచ్చకు దారితీసింది. కావాలనే కాంగ్రెస్ కూల్చివేయించిందని బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఆలయాల కూల్చివేతపై ఇప్పటికే హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. రోడ్డు వెడల్పులో భాగంగా కూల్చివేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నప్పటికీ.. ఈ కూల్చివేత వ్యవహారంపై గోదావరిఖనిలో పెను దుమారం రేపుతోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రహదారి పైన, పక్కన ఉన్న సుమారు 46 మైసమ్మ ఆలయాలున్నాయి. గత బుధవారం అర్ధరాత్రి మున్సిపల్‌ అధికారులు ముకుమ్మడిగా ఆలయాలను కూల్చివేశారు. రహదారి భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని కార్పొరేషన్ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. హిందువులు భక్తికి విశ్వాసానికి ప్రతీకగా భావించే ఆలయాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూల్చివేయడంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అధికారులు అవలంబించిన వైఖరిని ఖండిస్తూ నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టి ఆలయాలను అదే స్థానంలో పునర్నిర్మించాలని హిందూ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

- Advertisement -

అధికారులకు బండి సంజయ్‌ అల్టిమేటం..

స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కనసన్నలోనే ఆలయాల కూల్చివేత జరిగిందని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి, ఆలయాలను పునర్నిర్మించేంతవరకు ఉద్యమాలను కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే, అధికారులు అత్యుత్సాహంతో ఈ తప్పిదానికి పాల్పడ్డారని స్థానిక ఎమ్మెల్యేకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టడంతో పాటు ఆలయాల పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే 46 దేవాలయాలను కూల్చివేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆలయాలను కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. స్థానిక అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లో కూల్చివేసిన ఆలయాలన్నింటిని యధా స్థానంలో పునర్నిర్మించాలని, లేదంటే తానే స్వయంగా వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న దర్గాలను తొలగిస్తానని అల్టిమేటం జారీ చేశారు. రోడ్ల వెడల్పు, పునర్నిర్మాణం పేరిట హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా అలయాలని కూల్చివేయడం సరైన విధానం కాదని కేంద్రమంత్రి బండిసంజయ్ కలెక్టర్‌తో మాట్లడటమే కాకుండా తిరిగి నిర్మాణం చెయ్యకపోతే తానే స్వయంగా వస్తానని హెచ్చరించడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. కేవలం రొడ్డు విస్తరణ కొసం మాత్రమే కూలగొట్టామని, ప్రక్కన‌ నిర్మాణం చేస్తామని తెలపడంతో వివాదం సద్దుమణిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad