తెలంగాణ ధూప తీర్చిన పథకం మిషన్ భగీరథ అని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలోని మిషన్ భగీరథ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన నిర్వహించిన మంచినీళ్ల పండగ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రసమయి మాట్లాడుతూ… అపర భగీరతుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు సారథ్యంలో రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా పరిశుభ్రమైన, సురక్షి తమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కృష్ణా,గోదావరి నదుల నీటిని శుద్ధి చేసి రాష్ట్రంలోని కోట్లాది మంది దాహార్తిని ‘మిషన్ భగీరథ’ తీరుస్తుందన్నారు. రాబోయే తరాల తాగునీటి అవసరాలను తీర్చే భారీ మౌలిక సదుపాయాలు, అత్యాధునిక నీటి సరఫరా వ్యవస్థతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా మిషన్ భగీరథ తాగునీటిని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “మిషన్ భగీరథ” పథకాన్ని కేంద్ర ప్రభుత్వం “హర్ ఘర్ జల్” పథకం పేరుతో అమలు చేస్తుండటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని వివరించారు. గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజు లు, బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిన జనాలు.. ఎండాకాలం వచ్చిందంటే ‘పానీ’పాట్లతో అల్లాడి పోయిన ప్రజలు..సమైక్య పాలనలో తాగు నీటి కోసం సతమతమైన పరిస్థితి నేడు పోయిందని చెప్పారు. ఎల్ఎండి కాలనీలో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం 1800 కోట్లతో నిర్మాణం అయి, 125 ఎంఎల్డి నీటి శుద్ధి కేంద్రంలో శుద్ధి చేసి 1610.95 కి. మీ పైపుల ద్వారా మంచి నీరు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే డా. రసమయి తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు, బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, సుడా ఛైర్మెన్ జీ.వి రామకృష్ణ రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.