తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మూసీ ప్రక్షాళనపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. భాగ్యనగరం బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన చేయాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదే పదే చెబుతున్నారు. అందులో భాగంగా మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును తీసుకువచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవ పాదయాత్రను కూడా చేపట్టారు. ఈ నెల 8న (రేపు) యాదాద్రిలో పాదయాత్ర చేయనున్నారు. ముందుగా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం వలిగొండ నుంచి బీబీనగర్ వరకు ఆరు కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేయనున్నారు. స్థానిక స్థితిగతులు, మూసీ వెంట నివసిస్తున్న ప్రజల ఇబ్బందులు తెలుసుకోనున్నారు.
Also Read : KCR – KTR | గంట నిలబడి, గ్లాస్ నీళ్లు తాగండి.. కాంగ్రెస్ ఛాలెంజ్
ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటన అధికారులు మధ్య చిచ్చు రేపింది. రెండు డిపార్టుమెంటులకి సంబంధించిన అధికారులు వాగ్వాదానికి దిగారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో పని భారమంతా మా మీద పడిందని అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆర్ అండ్ బీ, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య వార్ నెలకొంది. ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వావద్ద మూసి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులంతా సీఎం ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఏర్పాట్లలో R&B, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు శాఖల అధికారులు ఒకరినొకరు తిట్టుకున్నారు. పని భారమంతా మా మీదే పడిందని ఒక శాఖ అధికారులు ఆరోపించడమే గొడవకు కారణమని సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.