Insurance to RTC Passengers: గత కొన్ని రోజుల క్రితం కర్నూల్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం.. ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్‌లో జర్నీ అంటే భయపడేలా చేసింది. అందుకే ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరగడంతో ఆదరణ పెరిగింది. కానీ ఈ రోజు తెల్లవారుజామున జరిగిన మరో ఘోర ప్రమాదం.. ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణం అంటే ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇన్సూరెన్స్ లేదు. మరి బాధిత కుటుంబాల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/chevella-three-sisters-road-accident-emotional-story/
సాధారణంగా ఆర్టీసీ బస్సులో టికెట్ ఛార్జీలో రూ. 1 సేఫ్టీ సెస్ కూడా యాడ్ అవుతుంది. కానీ అది బీమా కాదు. కేవలం ఎక్స్-గ్రేషియా ఫండ్ మాత్రమే.. మోటార్ వెహికల్ యాక్ట్- 1988 ప్రకారం ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్ బస్సుల ప్రయాణికులకు బీమా తప్పనిసరి (అదనపు ఎండార్స్‌మెంట్) చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రవాణా వ్యవస్థల్లో ఆ సదుపాయం లేదు. దీంతో ప్రభుత్వ రవాణాలో బీమా మినహాయింపు ఎందుకని ఇప్పుడు జనం ప్రశ్నిస్తున్నారు.
దీనికి సమాధానం కూడా ఆర్టీసీ ప్రతినిధులు గతంలో పలుమార్లు వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 10 వేల పైచిలుకు బస్సులకు ఏటా రూ. కోట్ల ప్రీమియం కట్టడం రవాణా సంస్థకు తలకుమించిన భారం అంటూ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే బీమా యాడ్‌పై గతంలో పలు ప్రతిపాదనలు కూడా చేశారు. 2010లోనే ఆర్టీసీ టికెట్‌లో బీమా యాడ్ చేయాలని.. దీని కోసం టికెట్ ధరలో రూ. 2 నుంచి 5 వసూలు చేసి బీమా తీసుకోవాలని ఆలోచన చేశారు. కానీ పలు కారణాలతో అమలుకు నోచుకోలేకపోయింది.
అయితే, ఆర్టీసీ బస్సుల్లో ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే, బీమా లేకపోయినా ఎక్స్-గ్రేషియా (ప్రభుత్వ సహాయం) ఉండటం కొంచెం ఉపశమనం. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. పైనుంచి రూ. 3-5 లక్షలు చొప్పున ఆర్టీసీ ఫండ్ నుంచి పరిహారం అందిస్తారు. మొత్తంగా రూ. 8 నుంచి 10 లక్షలు వరకు బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/chevella-bus-accident-updates-2/
కాగా, చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతిపై రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ. 7 లక్షలు(ప్రభుత్వం రూ. 5 లక్షలు, ఆర్టీసీ రూ. 2 లక్షలు) చొప్పున ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి తక్షణ సాయం కింద రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం, గాయపడిన వారికి రూ. 50 వేలు అందిస్తున్నట్లుగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.


