పాలమూరు ప్రజా దీవెన సభతో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ప్రచార శంఖారావం
ముఖ్యమంత్రిని ఆహ్వానించిన సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, ప్రజాప్రతినిధులు
మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. సి.డబ్ల్యూ.సి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న “పాలమూరు న్యాయ యాత్ర” ముగింపు సభకు ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మహబూబ్ నగర్ శాసనసభ్యుల బృందం ఆహ్వానించింది. మార్చ్ 6 సాయంత్రం 4 గంటలకు మహబూబ్ నగర్ పట్టణంలోని MVS కళాశాల మైదానంలో సభ “పాలమూరు ప్రజా దీవెన సభ” జరుగనుంది.
పాలమూరు ప్రజా దీవెన సభతో మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. ఇటీవలే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసి, సంగంబండ బాధితులకు 11 కోట్ల పరిహారం విడుదల చేసి… కొడంగల్ కు ఐదు వేల కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి గారు ఈ సభలో మహబూబ్ నగర్ జిల్లాకు మరిన్ని అభివృద్ధి వరాలు ప్రకటిస్తారనే అంచనాలున్నాయి. ముఖ్యమంత్రిని కలిసినవారిలో వంశీచంద్ రెడ్డి, శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, జి. మధుసూదన్ రెడ్డి, వేర్లపల్లి శంకర్, అనిరుద్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ ఉన్నారు.