Yuva Vikasam | ఏడాదిలో 55,143 ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ నేడు పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం (Yuva Vikasam) సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రూప్-4 లో ఎంపికైన 8,084 మందికి నియామక పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గ్రూప్-4 లో ఎంపికైన వారికి యువ వికాసం వేదికపై నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది.. మన ఉద్యోగాల కోసం.. ప్రజలకు ఉపాధి కోసం.. మన ప్రాంత అభివృద్ధి కోసం అని సీఎం పేర్కొన్నారు.
కరీంనగర్ గడ్డపై కాలు పెట్టినప్పుడల్లా ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారనే నమ్మకాన్ని కలిగించిన సోనియమ్మ గుర్తుకు వస్తారని సీఎం రేవంత్ వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియమ్మ తెలంగాణ కలను సాకారం చేశారని సోనియాగాంధీని కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామన్నారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని కంకణం కట్టుకున్నామని చెప్పారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదని సీఎం స్పష్టం చేశారు.
కేసీఆర్ హయాంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని రేవంత్ మండిపడ్డారు. “మేం అధికారంలోకి రాగానే యూనివర్సిటీలను బలోపేతం చేసాం. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్, లా కాలేజీ కావాలని కోరారు… వాటిని ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కనీసం సమస్యలపై ధర్నా చేసుకోలేనంత నిర్బంధాల మధ్య తెలంగాణ పదేళ్లు మగ్గిపోయింది. మేం అధికారంలోకి రాగానే ఇందిరా పార్కులో ధర్నా చౌక్ లో ధర్నాలు చేసుకునే అవకాశం కల్పించాం. మా పీసీసీ అధ్యక్షుడు వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. పదేళ్లలో హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే విద్యార్థులకు డైట్, చార్జీలు పెంచాం. మళ్లీ నిరుద్యోగ ఆత్మహత్యలు జరుగొద్దనే ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసాం” అని రేవంత్ వెల్లడించారు.