రానున్న అయిదేళ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయించే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మంది మహిళలున్నారని, ఆ సంఖ్యను కోటికి పెంచి వారందరిని కోటీశ్వరులను చేస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళల సమక్షంలో మంగళవారం నిర్వహించిన మహాలక్ష్మి-స్వశక్తి మహిళా సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ, ధనిక తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుందని, మహిళలు తమ పిల్లలను డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లను చేసుకోగలరని ముఖ్యమంత్రి అన్నారు. సదస్సులో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, అక్కచెల్లెళ్లతో మాట్లాడిన తర్వాత ఆయా ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేదనే విషయం స్పష్టమైందన్నారు. అందుకే ఎస్‌హెచ్‌జీల ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామం పక్కన రానున్న నెల రోజుల్లో వంద దుకాణాలు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అక్కడ విక్రయాలతో సంఘాల ఉత్పత్తులు టాటా, బిర్లాలు, అదానీలు, అంబానీల ఉత్పత్తులతో పోటీపడేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం జరుపుకొనే అవకాశం కలుగుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అని, తాము ఓ మహిళ నాయకత్వంలో పని చేయడానికి గర్విస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ కోసం యువకులు బలిదానంతో చేసుకుంటుంటే, కుటుంబ సభ్యులను కోల్పోతే బాధ ఎలా ఉంటుందో అనుభవించిన సోనియా గాంధీ వాటిని ఆపి వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోతోందని తెలిసినా తెలంగాణ ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గతేడాది సెప్టెంబరు 17న సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామని, ఇప్పటికే 23 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని ఆయన తెలిపారు. మహిళలను కట్టెల పొయ్యి కష్టాలను గట్టెక్కించేందుకు గతంలో దీపం పథకం ద్వారా సోనియా గాంధీ రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గత ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి దానిని రూ.1200కు పెంచి మళ్లీ కట్టెల పొయ్యికి మళ్లే పరిస్థితి కల్పించారని ఆయన దుయ్యబట్టారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, కేసీఆర్ రాజీవ్ ఆరోగ్యశ్రీని గాలికి వదిలిస్తే తాము అధికారంలోకి రాగానే దానిని పునరుద్ధరించి దాని పరిమితిని రూ.పది లక్షలకు పెంచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు ప్రజలను మోసం చేశారని, తాము రాష్ట్రంలో పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో రూ.22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు.
- ఆడ బిడ్డల అండతోనే అధికారంలోకి…
రాష్ట్రంలో ఆడ బిడ్డల ఆశీర్వాదంతోనే తాము ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంటే జీర్ణించుకోలేని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారంటూ ధర్నాలు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలా వద్దా చెప్పాలని ముఖ్యమంత్రి మహిళలను కోరారు. తాము ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేస్తామంటుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని, తాను ఏమైనా వాళ్లు దోచుకున్న సొమ్ములా వాటా అడిగానా, జన్వాడ ఫాంహౌస్‌లో భూమి కోరానా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు చోటు ఇవ్వలేదని, తాము ఇద్దరు మహిళలకు చోటు ఇచ్చి గౌరవించామని ముఖ్యమంత్రి తెలిపారు.
కేసీఆర్ హయాంలో బతుకమ్మ ఆడాలన్నా ఆయన బిడ్డ కవితనే ఆడాలని, ఎంపీ కావాలన్నా, ఆమె ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ కావాలన్నా కవితనే కావాలన్నారు. ఆయనకు ఆయన బిడ్డపై ప్రేమ ఉన్నట్లే.. తనకు తన అక్కా చెల్లెళ్లయిన రాష్ట్ర మహిళలపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం లక్ష మంది సదస్సు పెట్టామని, రానున్న రోజుల్లో పది లక్షల మంది మహిళలతో హైదరాబాద్‌లో కవాతు చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామనే వారికి గుణపాఠం చెబుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయాలంటున్నారని, పదేళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఏం చేశారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కనీస మద్దతు ధర అడిగిన రైతులపై తుపాకీ తూటాలు పేల్చారని, ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదని, స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని నయాపైసా వేయలేదని మండిపడ్డారు.
నరేంద్ర మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని, అందుకే బీజేపీ ప్రకటించిన 9 సీట్లలో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదని, కేసీఆర్ ప్రకటించిన నాలుగు సీట్లలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లలో గెలిపించాలని, కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామనే వారు మీ ఇళ్ల వద్దకు వస్తే వారికి వాతలు పెట్టాలని మహిళలకు ముఖ్యమంత్రి సూచించారు.
- స్టాళ్ల సందర్శన.. మహిళలతో సంభాషణ….
స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సుకు ముందు సందర్శించారు. ఆయా సంఘాలు చేసిన ఉత్పత్తులను పరిశీలించి, ముడి సరకుల సేకరణ, తయారీ, మార్కెటింగ్ అంశాల వివరాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు..
- రూ.లక్ష కోట్ల రుణాల అనుసంధానం…
మహిళా శక్తి మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరులతో కలిసి ఆవిష్కరించారు. వచ్చే అయిదేళ్లలో మహిళలకు బ్యాంకులు, స్త్రీ నిధి ద్వారా ఎస్‌హెచ్‌జీలకు రూ.లక్ష కోట్ల రుణాలను అనుసంధానించడం, సంఘాలకు వడ్డీ లేని రుణాలు పునరుద్ధరించడం, సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్, సంఘాలకు శిక్షణ, సంఘాల సభ్యులకు రుణ బీమా, సంఘాల్లోని మహిళలకు రూ.పది లక్షల జీవిత బీమా, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సంఘాలతో నిర్వహణ వంటి అంశాలు విజన్ డాక్యుమెంట్‌లో ఉన్నాయి.