బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొత్త అర్థం చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం రేవంత్ మాట్లాడుతూ ప్రధాని మోదీ(PM Modi)పై తీవ్ర విమర్శలు చేశారు. గజనీ మహమ్మద్ హిందుస్తాన్‌ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు.. రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నాల్లోనే మోదీ ఉన్నారని విమర్శించారు. కానీ ఆయన ప్రయత్నం ఫలించడంలేదన్నారు.
అప్పట్లో బ్రిటిషర్ల చెర నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు.. ఇప్పుడు బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిలబడ్డారని పేర్కొన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని.. ఒక యుద్ధం అన్నారు. ఈ యుద్ధం గాంధీ పరివార్, గాడ్సే పరివార్ మధ్య జరుగుతుందన్నారు. గాడ్సే పరివార్ వైపు నుంచి మోదీ.. గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ పోరాడుతున్నారని చెప్పారు. మనమంతా రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు గాంధీ పరివార్‌గా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలబడాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు.