Saturday, November 15, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: గోల్కొండ సాక్షిగా రేవంత్ గర్జన "ప్రపంచంతో పోటీ.. పేదలే మాకు ప్రగతి!"

CM Revanth Reddy: గోల్కొండ సాక్షిగా రేవంత్ గర్జన “ప్రపంచంతో పోటీ.. పేదలే మాకు ప్రగతి!”

CM Revanth Reddy Independence Day speech: గోల్కొండ బురుజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్బాణాలు..! ప్రపంచానికి దీటుగా తెలంగాణ ప్రగతి పరుగు తీస్తోందని వ్యాఖ్యలు.  పేదల సంక్షేమమే ప్రభుత్వానికి పునాది అని ప్రతిన..! ఇంతకీ సీఎం తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయాలేంటి..? బీసీ బిల్లుల ఆమోదంపై కేంద్రానికి పెట్టిన గడువు ఎంత..? కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యల ఆంతర్యమేమిటి..?

- Advertisement -

భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రాత్మక గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి, తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై తనదైన శైలిలో ప్రసంగించారు. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడే దార్శనికతతో, అదే సమయంలో పేదల సంక్షేమమే పరమావధిగా తమ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతోందని ఆయన ఉద్ఘాటించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.

సంక్షేమ సారథ్యం.. సరికొత్త చరిత్ర: ప్రజా ప్రభుత్వంలోనే పేదల సమస్యలకు నిజమైన పరిష్కారం లభిస్తుందని సీఎం స్పష్టం చేశారు. “సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పాలన” అని పేర్కొంటూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకం కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదని, పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. రేషన్ షాపులు పేదలకు భరోసా కేంద్రాలుగా మారాయని అన్నారు. అదేవిధంగా, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మధ్యవర్తులు లేకుండా, పేదరికమే ప్రామాణికంగా నిజమైన లబ్ధిదారులకు సొంతింటి కలను నెరవేరుస్తున్నామని హామీ ఇచ్చారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/illegal-surrogacy-racket-busted-hyderabad-pet-basheerabad/

అన్నదాతకు అండ.. అన్నపూర్ణగా తెలంగాణ: గతేడాది ఆగస్టు 15న ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీని విజయవంతంగా అమలు చేసి సగర్వంగా నిలబడ్డామని రేవంత్ రెడ్డి తెలిపారు. విత్తనాలు వేసే సమయానికే రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా సాయాన్ని జమ చేశామని, కేవలం 9 రోజుల్లోనే ఎలాంటి పరిమితులు లేకుండా రూ.9 వేల కోట్లను బదిలీ చేశామని గుర్తుచేశారు. ప్రభుత్వం అండగా నిలవడంతో రైతులు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలిపారని ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు రాకపోయినా, జవహర్‌లాల్ నెహ్రూ నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరామ్‌సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారానే ధాన్యం దిగుబడిలో రికార్డులు సాధించామని సగర్వంగా ప్రకటించారు.

బీసీ గళం.. దిల్లీకి విజ్ఞాపన: సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏలోనే ఉందని పునరుద్ఘాటించిన సీఎం, ఒక యజ్ఞంలా కుల, ఆర్థిక, సామాజిక సర్వేను పూర్తి చేశామన్నారు. ఈ సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మార్చి 2న అసెంబ్లీలో బిల్లులను ఆమోదించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఈ బీసీ బిల్లులను తక్షణమే ఆమోదించాలని గోల్కొండ కోట వేదికగా కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ఆయన విజ్ఞప్తి చేశారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/today-moderate-rains-in-telangana-by-hyderabad-meteorological-department-officials/

జల జగడం.. రాజీపడే ప్రసక్తే లేదు: గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణ హక్కును వదులుకోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ ఆయన, కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమని, తెలంగాణలో ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భూములు సస్యశ్యామలం అయిన తర్వాతే పక్క రాష్ట్రాల గురించి ఆలోచిస్తామని ఆయన అన్నారు. ప్రజల శ్రేయస్సు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, తెలంగాణ వాటా జలాలను సాధించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad